- ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన
తల్లాడ, వెలుగు : మద్యంలో పురుగుల మందు కలిపి ఓ వ్యక్తి తన కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని కలకొడెమ గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఆదూరి రాజేశ్, నాగరాజు (17) తండ్రీకొడుకులు. రాజేశ్ భార్య గతంలోనే చనిపోవడంతో తండ్రీకొడుకులిద్దరూ మద్యానికి బానిసయ్యారు. మద్యం మత్తులో ఇద్దరూ గొడవ పడుతుండడంతో.. నాగరాజు తండ్రిని కొడుతుండేవాడు.
దీంతో కొడుకును చంపేయాలని నిర్ణయించుకున్న రాజేశ్ గత నెల 20న మద్యంలో పురుగుల మందు కలిపి నాగరాజుకు ఇచ్చాడు. అది తాగిన నాగరాజు అస్వస్థతకు గురికావడంతో ఖమ్మం హాస్పిటల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గత నెల 31న అతడు చనిపోయాడు. చనిపోవడానికి ముందు.. తన తండ్రే పురుగుల మందు కలిపిన మద్యం తాగించాడని నాగరాజు అతడి పెద్దమ్మకు చెప్పడంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
