ఎంగేజ్​ మెంట్​ తెల్లారే కొడుకు మృతి..తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ఎంగేజ్​ మెంట్​ తెల్లారే కొడుకు మృతి..తట్టుకోలేక  తండ్రి ఆత్మహత్య

ఆసిఫాబాద్, వెలుగు : ఒక్కగానొక్క కొడుకు ఎంగేజ్మెంట్ ఘనంగా చేశాడా తండ్రి. ఆ ఇంట్లో ఇంకా సందడి, ఆనందం తగ్గలేదు. బంధువులు వారి ఇండ్లకు కూడా వెళ్లలేదు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో అంతులేని విషాదం నెలకొంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామానికి చెందిన వసాకే భీంరావు  (47) ఉప సర్పంచ్. ఈయనకు భార్య, కొడుకు తులసీ రాం (21) , కూతురు ఉన్నారు. కూతురికి పదిహేను రోజుల క్రితమే పెండ్లి చేశారు. కొడుకు తులసీరాం జిల్లా కేంద్రంలోని చైతన్య కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 

ఇతడికి అదే గ్రామానికి చెందిన యువతితో బుధవారం ఎంగేజ్మెంట్ చేశారు. గురువారం ఉదయం పని ఉందని చెప్పి తులసీరాం స్కూటీపై ఆసిఫాబాద్ వెళ్లాడు. తిరిగి సామెలకు వస్తుండగా మంచిర్యాల–చంద్రాపుర్ నేషనల్ హైవే నిర్మాణ పనులకు వెళ్తున్న టిప్పర్ లారీ ఓవర్​స్పీడ్​తో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. తులసీరాం వాహనంతో సహా టిప్పర్ కిందకు దూసుకు పోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు చనిపోయాడని తెలుసుకున్న భీంరావు తట్టుకోలేకపోయాడు. అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేని భీంరావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. స్థానికులు, కుటుంబీకులు హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ  చనిపోయాడు. 

న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో 

ప్రమాదానికి డీబీఎల్​కంపెనీకి చెందిన టిప్పర్ కారణమని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, బంధువులు  ప్రమాదం జరిగిన జైత్ పూర్ వద్ద రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్​జామ్ ఏర్పడింది. ఆందోళన కొనసాగుతుండగానే భీంరావు మృతి చెందాడని వార్త రావడంతో ఆందోళన చేస్తున్న వాళ్లు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తండ్రీకొడుకుల మృతదేహాలను జిల్లా కేంద్రంలోని దవాఖానలో పక్క పక్కనే పెట్టి పోస్ట్ మార్టం చేయడం కలచివేసింది. వాంకిడి ఎస్ఐ సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

నస్పూర్​లో బైక్​ను ఢీకొన్న ట్రాక్టర్​

నస్పూర్​/కోల్​బెల్ట్​: మంచిర్యాల జిల్లా నస్పూర్​మండలం శ్రీరాంపూర్​ సింగరేణి జీఎం ఆఫీస్​ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు చనిపోయారు. మందమర్రి మండలం శంకర్​పల్లి గ్రామానికి చెందిన దర్శనాల రమేశ్​(45), -వెన్నెల దంపతుల కు కొడుకు సూర్యతేజ(12). సుభీష్ణ సంతానం. భార్యతో పాటు ఏడో తరగతి చదువుతున్న సూర్యతేజతో కలిసి బైక్​పై రమేశ్​గోదావరిఖని వెళ్లాడు. తిరిగి వస్తుండగా శ్రీరాంపూర్​ సింగరేణి జీఎం సమీపంలోని ఆర్కే న్యూటెక్​ మైన్​ క్రాస్​(మందమర్రి వైపు వెళ్లే రోడ్డు) వద్ద నేషనల్​ హైవే 63 రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి స్పీడ్​గా వచ్చిన సిమెంట్​ లోడ్​ ట్రాక్టర్​​ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్​, సూర్యతేజ అక్కడికక్కడే చనిపోయారు. వెన్నెల తీవ్రంగా గాయపడగా ఆమెను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రాక్టర్ ​డ్రైవర్​ ర్యాష్ ​ డ్రైవింగ్​ కారణంగానే ప్రమాదం జరిగిందని  శ్రీరాంపూర్​ ఎస్సై రాజేశ్​తెలిపారు.