INCA అవార్డ్స్ 2026: జాతీయ వేదికపై టాలీవుడ్ జెండా.. ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక!

INCA అవార్డ్స్ 2026: జాతీయ వేదికపై టాలీవుడ్ జెండా.. ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో  ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే  ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ 2026 విజేతలను ప్రకటించింది.  దేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఏకతాటిపైకి తెచ్చే ఈ వేదికపై ఈసారి తెలుగు సినిమా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా యువసామ్రాట్ నాగచైతన్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జాతీయ స్థాయిలో మెరిశారు.  ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకకు ముంబై వేదిక కానుంది. 

 చైతూ 'గోల్డెన్' పీరియడ్

ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నాగచైతన్య, ‘తండేల్’ చిత్రంలో మత్స్యకారుడిగా చూపించిన అద్భుత నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ 'గద్దర్ పురస్కారం' అందుకున్న చైతూకి ఇది వరుసగా రెండో పెద్ద గౌరవం. అలాగే, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రంలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు గానూ రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. గద్దర్ అవార్డ్స్ రిపీట్ చేస్తూ వీరిద్దరూ మళ్ళీ జాతీయ వేదికపై ఉత్తమ నటీనటులుగా నిలవడం విశేషం.

టాలీవుడ్ విజేతల జోరు

తెలుగు విభాగంలో మరికొన్ని పురస్కారాలు లభించాయి. వాటిల్లో తేజ సజ్జా నటించిన సోషియో ఫాంటసీ హిట్ ‘మిరాయ్’ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అవార్డు కూడా దక్కింది. ఉత్తమ దర్శకుడుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన అనిల్ రావిపూడికి వరించింది. ఈ సినిమాలో అదే చిత్రంలో తనదైన శైలిలో నవ్వులు పూయించిన మాస్టర్ రేవంత్ (బుల్లిరాజు) ఉత్తమ హాస్య నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ‘కోర్ట్‌’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ జగదీష్  ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా అవార్డును అందుకోనున్నారు.

ఇతర భాషల్లో విజేతలు వీరే..

దక్షిణాది నుంచి రిషబ్ శెట్టి తన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంతో కన్నడలో ఉత్తమ నటుడు, దర్శకుడు , ఉత్తమ చిత్రం కేటగిరీల్లో క్లీన్ స్వీప్ చేశారు. తమిళంలో దుల్కర్ సల్మాన్ (కాంత), సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)లు సత్తా చాటారు. మలయాళంలో నివిన్ పౌలీ ఉత్తమ నటుడిగా నిలిచారు. హిందీలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ చిత్రానికి గానూ రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘హక్’ చిత్రంతో యామీ గౌతమ్ ఉత్తమ నటిగా నిలిచారు.

ముంబైలో తారల సందడి

ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 16న ముంబైలో కనులపండువగా జరగనుంది. టాలీవుడ్ రానా దగ్గుబాటి, బాలీవుడ్ కరణ్ జోహార్ కలిసి ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అలనాటి సుందరి రేఖ, దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డుల పంపిణీ జరగనుంది. మొత్తానికి, 2026 INCA అవార్డ్స్‌లో తెలుగు సినిమా ప్రతిభ విశ్వవ్యాప్తమైంది.