అపోలో హెల్త్‌కేర్ సంస్థ 2025లో సుమారు 30 లక్షల మందికి చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని యువత అనారోగ్యం బారిన పడుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 20 ఏళ్ల వయస్సులోనే ప్రతి ఐదుగురిలో ఒకరు (20%) ప్రీడయాబెటిక్ గా ఉన్నారు. అంటే వీరికి ప్రస్తుతం షుగర్ వ్యాధి లేకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ముందు జాగ్రత్త పడకపోతే వీరికి త్వరలోనే మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
దాదాపు 70 శాతం మంది యువతలో విటమిన్-డి తక్కువగా ఉంది. ఎముకలు బలంగా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ విటమిన్-డి చాలా ముఖ్యం. 30 ఏళ్లలోపు వారిలో మూడింట రెండు వంతుల మందికి కనీస బలం, వశ్యత (Flexibility) లేదా బాడీ బ్యాలెన్స్ లేవు. దీనివల్ల భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇక విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి చూస్తే... 17 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్లు తేలింది. అలాగే 30 ఏళ్లు దాటిన ఉద్యోగులలో సగం మందికి షుగర్ లేదా ప్రీడయాబెటిస్ ఉంది. వీరిలో 80 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
మహిళల ఆరోగ్యంపై రిపోర్ట్
40 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోయినా పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. మహిళల్లో రక్తహీనత, ఊబకాయం కూడా ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ : భారతీయుల్లో 90% మందికి పళ్ల సమస్యలు..
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ల ప్రకారం.. ప్రతి ఒక్కరి జీవనశైలి, వయస్సును బట్టి ఆరోగ్య సమస్యలు వేరుగా ఉంటాయి. అందుకే అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి. కేవలం హెల్త్ చెకప్ చేయించుకోవడమే కాదు, డాక్టర్లు చెప్పినట్లుగా జీవనశైలిని మార్చుకోవడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఈ రిపోర్ట్ చెబుతోంది.
