కన్న తండ్రే కూతుర్ని అమ్మేశాడు

కన్న తండ్రే కూతుర్ని అమ్మేశాడు

భర్తను కోల్పోయి.. నిస్సహాయ స్థితిలో ఉన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే… ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఏ తోడు లేని దీనస్థితిలో ఉన్న కూతురుని అంగట్లో సరుకును చేసి అమ్మేశాడు. తండ్రి, అత్త కలిసి రూ.10వేలకు ఓ వ్యక్తికి అమ్మేశారు. బాధితురాలిని కొనుగోలుచేసిన ఆ రాక్షసుడు నిత్యం ఆమెపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు పాల్పడేవాడు. తాను అప్పుతీసుకున్న వ్యక్తుల దగ్గరికి కూడా ఆమెను పంపించేవాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ అభాగ్యురాలికి అక్కడ కూడా న్యాయం జరగలేదు. జీవితంపై విరక్తి చెందిన ఆమె.. మనస్తాపంతో కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

హార్పూర్‌ కు చెందిన బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది.
అయితే ఈ కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాధిత మహిళ పరిస్థితిని చూసి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ చలించిపోయారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

DCW జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు స్పందించిన యూపీ పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 14 మందిని అదుపులోకి తీసుకొన్నారు.