ఊరి రోడ్డు తెగినా పట్టించుకుంటలేరు

ఊరి రోడ్డు తెగినా పట్టించుకుంటలేరు
  • మూడు రోజులుగా గ్రామస్తులకు ఇక్కట్లు
  • గర్భిణిని నడిపిస్తూ హాస్పిటల్​కు తీసుకెళ్లిన ఆశ వర్కర్​

గజ్వేల్, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం దండుపల్లి మధిర గ్రామమైన ఫాతిమానగర్ ను కష్టాలు చుట్టుముట్టాయి. గ్రామానికి దారి తీసే రెండు రోడ్లు చెరువు అలుగుల కాణంగా  కొట్టుకుపోవడంతో మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఫాతిమానగర్ లో 150 మంది నివాసం ఉంటున్నారు. గ్రామం నుంచి తూప్రాన్ కు వెళ్లే రోడ్డు బోయినమ్మ చెరువు మత్తడి పొంగడంతో, రెండో వైపు ఉన్న రోడ్డు గుడ్ల చెరువు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

గ్రామంలో ముగ్గురు గర్భిణులు ఉన్నారు. మంగళవారం వరద తగ్గడంతో ఆశ కార్యకర్త ఒకరు కాలినడకన గ్రామానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అందులో ఒకరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని సూచించడంతో దెబ్బ తిన్న రోడ్డు మీద జాగ్రత్తగా నడిపిస్తూ గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి తెగిన రోడ్లకు రిపేర్లు చేయాలని సర్పంచ్ చింతల రాములు కోరారు.