
దేశం కోసం సైన్యంలో పనిచేయడం ఒక అదృష్టం. కానీ.. ఆ అదృష్టం కొన్నేళ్లే ఉంటుంది. అంటే ఆర్మీలో చాలామంది 35 ఏండ్లకే రిటైర్ అవుతారు. కొందరు ఆ తర్వాత ఏం చేయాలో తోచక చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కుంటారు. కానీ.. ఆ అవసరం లేకుండా ఆర్మీ జవాన్లను ఎంట్రపెన్యూర్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐ క్రియేట్ ఇండియా అనే సంస్థ. రిటైర్మెంట్కు ముందే వాళ్లను కలిసి స్టార్టప్స్ మీద అవగాహన కల్పిస్తోంది. ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి బిజినెస్‌లు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ వల్ల ఇప్పటివరకు ఎంతోమంది రిటైర్డ్ జవాన్లు ఎంట్రపెన్యూర్లుగా ఎదిగారు.
ఐ క్రియేట్ ఇండియా సంస్థ 25 సంవత్సరాలుగా సామాన్యులను ఎంట్రపెన్యూర్లుగా మార్చేందుకు పనిచేస్తోంది. ప్రధానంగా అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్లకు విజయాలను అందించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేసిన మాజీ సైనికులు, అధికారులకు సొంతంగా స్టార్టప్‌లు పెట్టుకునేలా ట్రైనింగ్, గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తోంది. సంస్థ చీఫ్ మెంటార్ ఉల్హాస్ కామత్ మాట్లాడుతూ.. ‘‘మొదటి 15 సంవత్సరాలు మేము స్కూళ్లు, కాలేజీలు, స్వయం సహాయక బృందాలపై మాత్రమే దృష్టి పెట్టాం. కానీ.. 2015 నుంచి మాజీ సైనికులకు ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధారణంగా ఆర్మీ నుంచి ఎక్కువమంది 35 సంవత్సరాల వయసులో రిటైర్ అవుతారు. అలా ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది పదవీ విరమణ పొందుతున్నారు. వాళ్లలో చాలామంది ‘రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి?’ అనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనిపించి మా ప్రయాణం మొదలుపెట్టాం” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడి నుంచే మొదలు..
బెంగళూరులోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్(ఏఎస్సీ)లో ఐ క్రియేట్ ఇండియా వాళ్లు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు. ఏఎస్సీ నుంచి రిటైర్ అయ్యే వాళ్లు అందుకు సంబంధించిన ఫామ్స్‌ని నింపేందుకు కొన్నాళ్ల ముందుగానే ఆఫీస్‌కు వస్తారు. అలా వచ్చిన వాళ్లకు అక్కడే ఎంట్రపెన్యూర్షిప్ మీద అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం ఐ క్రియేట్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వెటరన్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కూడా కుదిరింది.
మూడు దశల్లో..
ఐ క్రియేట్ ఇండియా మొత్తం మూడు దశల్లో ట్రైనింగ్ ఇస్తోంది. మొదటి దశలో మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ కాబోయే వాళ్లకు ‘ఎంటర్‌ప్రెన్యూర్ అవేర్‌నెస్ క్రియేషన్’ పేరుతో బిజినెస్ పట్ల అవగాహన కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఐదు రోజుల వర్క్‌షాప్ ద్వారా బిజినెస్ సక్సెస్ కోసం, ఎంట్రపెన్యూర్లుగా ఎదగడానికి కావాల్సిన సాధనాలు, సాంకేతికతల గురించి వివరిస్తారు. ఆ తర్వాత దశలో బిజినెస్ చేయాలనే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు సొంత ఐడియాతో ముందుకొచ్చేలా ప్రోత్సహిస్తారు. ‘‘ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలనేది మేము ఎప్పుడూ చెప్పము. కానీ.. ఐడియాలను ఎలా జనరేట్ చేయాలనేది మాత్రం చెప్తాం. దానివల్ల వాళ్లే వాళ్ల స్కిల్స్‌కు తగిన బిజినెస్‌ని ఎంచుకుంటారు. లేదంటే వాళ్ల స్కిల్స్‌తో సమాజంలోని ఏదైనా ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో కనుక్కుంటారు” అని ఉల్హాస్ చెప్పాడు. జవాన్లు తమ బిజినెస్ ఐడియా చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా అనుభవజ్ఞులైన ట్రైనర్లు వాళ్లకు స్కిల్స్ నేర్పిస్తారు. ట్రైనింగ్ సెంటర్ నుంచి సొంతూళ్లకు వెళ్లాక కూడా వాళ్లకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. వ్యాపారానికి కావాల్సిన డబ్బుని ఎలా సమకూర్చుకోవాలి? లోన్స్ ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వ పథకాలను ఎలా పొందాలి? ఇలా ప్రతి విషయంలోనూ సాయం చేస్తారు.
తెల్ల కమలాలతో ఆయిల్
ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు చెందిన ఆర్ధి కృష్ణారావు భారత సైన్యంలో హవల్దార్ (సార్జెంట్)గా 26 సంవత్సరాలు పనిచేశాడు. అయితే.. అతని రిటైర్మెంట్ టైం దగ్గర పడుతున్న కొద్దీ తరచూ భవిష్యత్తు గురించే ఆలోచించేవాడు. అతనికి ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేదు. కానీ.. ఏం చేయాలో తెలియదు. అప్పుడే అతనికి ‘ఐ క్రియేట్ ఇండియా’ సంస్థ గురించి తెలిసింది. అందులోనే ఆర్ధికి కెవ్డా ఆయిల్ ప్రాసెసింగ్ బిజినెస్‌కు కావాల్సిన పూర్తి స్కిల్స్ నేర్పించారు. కెవ్డా పూలను తెల్ల కమలం (వైట్ లోటస్) అని కూడా పిలుస్తుంటారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఇవి బాగా పండుతాయి. స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా వీటిని ప్రాసెస్ చేస్తారు. ఈ పువ్వు నుంచి ఫ్లేవర్(ఆయిల్)ని బయటకు తీసి అమ్ముతారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లీటరు ఆయిల్ ధర రూ. 5 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ నూనెను ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీలో వాడతారు. ఒడిశాలో పెరిగిన ఆర్ధికి ఈ పూల గురించి బాగా తెలుసు. కానీ, వాటితో బిజినెస్ చేయాలనే కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఐ క్రియేట్ ఇండియాలో చేరిన తర్వాతే అతనికి ఆ ఐడియా వచ్చింది. ‘‘ఐ క్రియేట్‌లో నేను పూర్తిచేసిన కోర్సు వల్ల వ్యాపారం ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకున్నా. ఆ తర్వాత కెవ్డా సాగు చేస్తున్న రైతులను కలిశా. దాని గురించి పూర్తిగా తెలుసుకున్నా. దాదాపు మూడు నెలలపాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా రీసెర్చ్ చేశా. ఆ తర్వాత ఒక్కో పువ్వుకు రూ. 30 చొప్పున చెల్లించి రైతుల నుంచి 30,000 కెవ్డా పువ్వులు కొన్నా. రెండు సంవత్సరాల క్రితం దీన్ని మొదలు పెట్టినప్పుడు అందరూ నాకు ‘ఈ స్టార్టప్ సక్సెస్ కాదు. డబ్బు వృథా చేసుకోకు’ అని సలహా ఇచ్చారు. కానీ.. నేను మాత్రం రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుందని నమ్మాను. ఇప్పుడు ప్రతి యేటా లక్షల్లో సంపాదిస్తున్నా” అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఆర్ధి మాత్రమే కాదు.. ఐ క్రియేట్ ఇండియా ఆధ్వర్యంలో తమ కలలు సాకారం చేసుకున్న ఎంతోమంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు.
ప్రతి కథా.. ప్రత్యేకమే!
ఐ క్రియేట్ ఇండియా కొంతమంది ఆర్మీ ఉద్యోగులకు వ్యాపారం ఎలా మొదలుపెట్టాలో నేర్పిస్తే.. మరికొందరికి వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్పించింది. ఉదాహరణకు... ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఖుష్ నసీబ్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలమైన తాండాలో చేనేత మిల్లుని నడుపుతున్నాడు. ఖుష్ కుటుంబం 1947 నుంచి చేనేత వ్యాపారంలో ఉంది. అతని ముత్తాత, తాత, తండ్రి అందరూ అదే వ్యాపారం చేశారు. కానీ.. నష్టాలు పెరగడంతో అతను వ్యాపారానికి దూరంగా ఉండేవాడు. కానీ.. ఐ క్రియేట్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వారసత్వంగా వస్తున్న అదే వ్యాపారంలోకి దిగాడు. ‘‘లాభాలు తక్కువగా వస్తున్నా వ్యాపార యజమానిగా ఉండటం వల్ల ప్రయోగాలు చేయడానికి తగినంత అవకాశం దొరికింది” అంటున్నాడు నసీబ్.
అద్దెకు వ్యవసాయ పరికరాలు
దవీందర్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్. అతను రైతు కుటుంబంలో పుట్టాడు. అందుకే ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత సొంతూళ్లోనే వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే సర్వీస్‌ని మొదలుపెట్టాడు. కొన్ని రకాల వ్యవసాయ పరికరాలు చాలా ఖరీదైనవి. చాలామంది రైతులు వాటిని కొనుగోలు చేయలేరు. అలాంటివాళ్లకు సూపర్ సీడర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ధాన్యం పొట్టుని వేరు చేసే మెషిన్లు అద్దెకు ఇస్తున్నాడు. అంతేకాదు.. ‘‘మన దేశంలోని చాలా ఇటుక బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి బొగ్గును వాడతారు. కానీ, మేము అందుకు బదులుగా వ్యవసాయ వేస్ట్‌ని వాడేందుకు ప్లాన్ చేస్తున్నాం. దానివల్ల రైతులు వేస్ట్‌ని పొలాల్లో కాల్చకుండా.. దాని నుంచి లాభాలు పొందొచ్చు” అంటున్నాడు దవీందర్ సింగ్.