- మిల్లర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎఫ్‌సీఐ
- బస్తాలు క్రమ పద్ధతిలో వేయలేదని ఫైర్
- 25 మిల్లుల్లో స్టాక్‌లోతేడా ఉన్నట్లు గుర్తింపు
- ఆ మిల్లుల నుంచి బియ్యం తీసుకోవద్దని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మిల్లర్లు తనిఖీలకు సహకరించడం లేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మిల్లర్లు నిబంధనలు పాటించడం లేదని, అధికారులు తనిఖీలకు వెళ్లిన వందలాది మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా వడ్ల బస్తాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్తాలు క్రమ పద్ధతిలో పెట్టాలని ముందస్తుగా సమాచారం ఇచ్చినా, మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని మండిపడింది. కొన్ని మిల్లుల్లో ధాన్యం షార్టేజ్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో మిల్లర్ల తీరుపై ఎఫ్‌సీఐ రీజనరల్ మేనేజర్ దీపక్ శర్మ సీరియస్ అయ్యారు. తనిఖీలు పూర్తి కాని మిల్లులతో పాటు ధాన్యం షార్టేజ్ ఉన్న మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవద్దని అధికారులకు మంగళవారం ఆదేశాలిచ్చారు. ఈ విషయమై సివిల్ సప్లయ్స్ కమిషనర్ కు సమాచారం అందించారు.
562 మిల్లుల్లో తనిఖీలు పూర్తికాలే..
అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో 2,320 మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు చేపట్టింది. ధాన్యం, బియ్యం నిల్వలు సక్రమంగా ఉంటేనే ఆయా మిల్లుల నుంచి బియ్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి ఎఫ్‌సీఐ టీమ్స్ మిల్లులకు వెళ్లి.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన వడ్లు ఎన్ని? మిల్లింగ్ అయింది ఎంత? నిల్వ ఉన్నది ఎంత? అని వెరిఫికేషన్ చేస్తున్నాయి. నిరుడు యాసంగికి సంబంధించి 475 మిల్లుల్లో, ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి 1,825 మిల్లుల్లో తనిఖీలు చేపట్టాయి. వీటిలో 562 మిల్లుల్లో తనిఖీలకు వీల్లేకుండా బస్తాలు ఉన్నాయని, బస్తాలను క్రమ పద్ధతిలో వేయకుండా మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎఫ్‌సీఐ గుర్తించింది. ఇందులో యాసంగికి సంబంధించి 92 మిల్లులు, వానాకాలానికి సంబంధించి 470 మిల్లులు ఉన్నాయి. వీటిల్లో బస్తాలు క్రమ పద్ధతిలో లేకపోవడంతో తనిఖీలు పూర్తి కాలేదని ఎఫ్‌సీఐ చెప్పింది. ఈ మిల్లుల్లో తనిఖీలు పూర్తయ్యే వరకూ బియ్యం తీసుకోవద్దని ఆదేశించింది.
25 మిల్లుల్లో అక్రమాలు..
25 మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో యాసంగికి సంబంధించి 4 మిల్లులు, వానాకాలానికి సంబంధించి 21 మిల్లుల్లో ధాన్యం తక్కువ ఉన్నట్లు తేల్చారు. ఎంతయితే ధాన్యం తక్కువ ఉందో, దానికి సంబంధించి బియ్యం తీసుకోవద్దని నిర్ణయించారు. కాగా, మార్చిలో 958 మిల్లుల్లో తనిఖీలు చేపట్టగా 40 మిల్లుల్లో 1.85 లక్షల క్వింటాళ్లు తేడా వచ్చినట్లు ఎఫ్‌సీఐ అధికారులు తేల్చారు.
