వామ్మో లక్క పురుగులు .. పురుగులకు వణుకుతున్న నెక్కొండ

వామ్మో లక్క పురుగులు .. పురుగులకు వణుకుతున్న నెక్కొండ
  • ఎఫ్‍సీఐ గోదాంల నుంచి కాలనీలపై దాడి 
  • తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన లక్షా 25 వేల మెట్రిక్‍ టన్నుల బియ్యం స్టోరేజీ
  • ఇండ్లల్లో పారడంతో ఇబ్బందులు 
  • స్కిన్‍ ఎలర్జీ బారిన పడుతున్న చిన్నారులు 
  • ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని కాంట్రాక్టర్లు, అధికారులు

వరంగల్‍/నెక్కొండ, వెలుగు: వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ పట్టణం లక్క పురుగుల దాడికి వణుకుతోంది. ఇంటా,  బయట కుప్పలుతెప్పలుగా స్వైరవిహారం చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నాలుగు, ఐదయ్యిందంటే చాలు కిలోమీటర్ల దూరం వరకు పాకుతూ కాలనీలకు చేరుతున్నాయి. దీంతో జనాలు పడుకుందామంటే మంచం నిండా అవే పాకడంతో నిద్రల్లేని రాత్రులు గడుపుతున్నారు. చిన్నారులు స్కిన్‍ ఇన్‍ఫెక్షన్‍ బారిన పడుతున్నారు. 10–15 ఏండ్లుగా ఈ సమస్య ఉన్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో లక్క పురుగుల బెడద మరింత తీవ్రమవుతోంది.

బియ్యం గోదాములతో పరేషాన్‍     

నెక్కొండ మండల కేంద్రం చుట్టూరా గోదాములు లక్కపురుగుల సమస్యకు కారణమవుతున్నాయి. ఇక్కడి రైల్వే ట్రాక్‍ను ఆనుకుని కొన్నేండ్ల కింద ఎఫ్‍సీఐ గోదాములు నిర్మించారు. ఇందులో దాదాపు లక్షా 25 వేల టన్నుల బియ్యం నిలువ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‍లో నిర్మించిన గోదాముల్లో దాదాపు 5 వేల టన్నుల బియ్యాన్ని నిలువ చేస్తున్నారు. ఈ క్రమంలో బియ్యానికి లక్క పురుగులు పడుతున్నాయి. రాజీవ్‍ నగర్‍, నందమూరి నగర్‍, ఎస్టీ కాలనీ, నెహ్రూ సెంటర్‍, బీసీ కాలనీ, అంబేద్కర్‍ సెంటర్‍, గుండ్రపల్లి, మడిపల్లి మొదలు అప్పల్‍రావ్‍ పేట వరకు లక్క పురుగులు వ్యాపిస్తున్నాయి.

 ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వీటి బెడద ఎక్కువవుతోంది. జనాల ఒంటిపై, బట్టలపై పారుతుండటంతో దురద సమస్యలు వస్తున్నాయి. హోటల్స్, స్వీట్‍ షాపులు, రెస్టారెంట్లు నడపలేని దుస్థితి నెలకొన్నది. మండల కేంద్రంలోని స్కూళ్లలో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘లక్క’ సమస్య పరిష్కరానికి ధర్నాలు, నిరసనలు..

గోదాముల్లో బియ్యానికి పురుగులు పట్టకుండా, గోదాముల నుంచి పురుగులు బయటకు వెళ్లకుండా చూడాలని నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటేటా వీటి సమస్య పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, కనీస స్పందనలేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. లక్క పురుగుల నివారణకు ప్రతిరోజూ నోవా, మాలతి, డెల్టా రకాల కంపెనీలకు చెందిన మందులను స్ప్రే చేయాల్సి ఉంటుందని, కానీ వారం పది రోజులకోసారి పిచికారీ చేయడంతో లక్క పురుగులపై మందుల ప్రభావం చూపట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పట్టింపులేని అధికారుల తీరును నిరసిస్తూ ఏటా జనాలు పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలకు దిగారు. సోమవారం పట్టణవాసులు అంబేద్కర్‍ సెంటర్‍లో ఆందోళన చేపట్టారు. అనంతరం జీపీ వద్దకు ర్యాలీగా వెళ్లి ఈవోకు వినతిపత్రం అందించారు. 

బయటకొస్తే ఒళ్లంతా లక్క పురుగులే..

లక్క పురుగులు విపరీతంగా వచ్చాయి. చూడటానికి చిన్న సమస్య అనిపించినా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్తున్నారు. సాయంత్రం నాలుగయ్యిందంటే ప్రతి ఒక్కరిపై ఒళ్లంతా ఈ పురుగులే కనిపిస్తాయి. నేను ఎఫ్‍సీఐ గోదాం దగ్గర్లో చిన్న హోటల్‍ నడుతుపున్నా. వంట చేద్దామంటే గిన్నెల్లో లక్క పురుగులు పడ్తున్నాయి. పురుగులు గోదాం దాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలే.

దాసరి శ్రీనివాస్‍ (నెక్కొండ)

ఉన్నాతాధికారులు స్పందించాలే..

లక్క పురుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. బయటకు వస్తే ఒళ్లంతా పాకి దురద వస్తుంది. స్కిన్‍ ఎలర్జీలు తప్పట్లేదు. ఈ సమస్య ఎప్పటినుంచో ఉన్నా, ఏటా వస్తుందని తెలిసినా స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తే తప్పితే మాకు లక్క పురుగుల గోస తప్పేలా లేదు.

 గోపగాని శ్రీకాంత్‍ (గుండ్రపల్లి)