రానున్న రోజుల్లో ఫోర్టీ ఫైడ్ రైస్ సరఫరా : సుధాకర్ రావు

రానున్న రోజుల్లో ఫోర్టీ ఫైడ్ రైస్ సరఫరా : సుధాకర్ రావు

దేశ ప్రజలకు నాణ్యమైన మంచి పోషకాలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు భారత ఆహార సంస్థ తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుధాకర్ రావు తెలిపారు. భారత ఆహార సంస్థ జాతీయ, రాష్ట్ర స్థాయి అధికారులు సనత్ నగర్ లోని గోదామును సందర్శించారు. అనంతరం తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుధాకర్ రావు మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఫోర్టీ ఫైడ్ రైస్ ను దేశవ్యాప్తంగా మార్చి 24 వరకు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. మంచి పోషకాలతో ఐరన్, విటమిన్ బి12లతో కూడిన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు.

సనత్ నగర్ డిపోలో 64.496 మెట్రిక్ టన్నుల బియ్యం నిలువ సామర్థ్యం కలిగి ఉందని, రాష్ట్రాల్లోని ఆహార నిలువ డిపోలలో 26.980 మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉందని సుధాకర్ రావు తెలిపారు. ప్రస్తుతం సనత్ నగర్ డిపో నుండి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ.. తూర్పు భారతదేశంలో బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల కింద ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుందని అన్నారు. ఐసీడీఎస్, టీపీడీఎస్, పీఎం పోషణ్ పథకాల కింద పంపిణీ చేస్తోందన్నారు. ప్రజా పంపిణీ కొరకు బియ్యం రీసైక్లింగ్ అరికట్టేందుకు నూతన పద్ధతులను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆహార ధాన్యాల నష్ట శాతాన్ని నియంత్రించేందుకు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నామన్నారు.