ఫీజు పైసలిస్తలేరు

ఫీజు పైసలిస్తలేరు

రీయింబర్స్‌‌మెంట్‌‌ రాక స్టూడెంట్లకు తిప్పలు
పైసలిస్తెనే సర్టిఫికెట్లు ఇస్తమంటున్న కాలేజీలు
సదువుకోలేక, నౌకరిలో చేరలేక ఇబ్బందులు
మొత్తం బకాయిలు రూ.1,451 కోట్లు
కిందటి ఏడాదివే రూ.1,164 కోట్లు
ఈ ఏడాది కావాల్సింది రూ.2,400 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగుఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ రాక రాష్ట్రంలో స్టూడెంట్లు తిప్పలు వడుతున్నరు. పైసలిచ్చేందుకు సర్కారు లేటు చేస్తుండటం.. ఆ పైసలిస్తెనే సర్టిఫికెట్లిస్తమని కాలేజీలు చెప్తుండటంతో ఇబ్బంది పడుతున్నరు. కొందరు ఎట్లోగట్ల కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నా.. పైసల్లేనోళ్లు మద్యల్నే సదువు ఆపేస్తున్నరు. సర్టిఫికెట్లు లేక జాబ్‌‌లో కూడా చేరలేకపోతున్నరు.

సర్కారు మస్తు లేటు

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌, స్కాలర్‌‌షిప్‌‌ల కోసం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్టూడెంట్లు దరఖాస్తు చేసుకుంటుంటారు. అర్హులైన వాళ్లకు వెంటనే 25 శాతం రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాలి. తర్వాత ఏడాది మధ్యలో 50%, చివర్లో మరో 25% ఇవ్వాలి. కానీ నిధుల విడుదలలో సర్కారు చాలా ఆలస్యం చేస్తోంది. గత విద్యా సంవత్సరం గడిచి 6 నెలలు దాటినా ఇంకా ఆ యేడు నిధులే ఇవ్వలేదు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అప్లికేషన్ల వెరిఫికేషనే పూర్తి కాలేదు. ఇప్పటికే పాత బకాయిలు రూ. 287.26 కోట్లు, గతేడాదివి రూ.1,164.4  కోట్లు ఇవ్వాల్సి ఉంది.

దరఖాస్తులు సూసుడే కాలేదు

అప్లికేషన్లు తీసుకోవడంలో ఆలస్యం పెరిగి దరఖాస్తుల పరిశీలన బాగా లేటవుతోంది. 2018-–19లో స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తుల ప్రక్రియ 2018 ఆగస్టు నుంచే మొదలైనా గడువును పలుమార్లు పొడిగించారు. 2019 ఫిబ్రవరి రెండో వారం వరకు అవకాశమిచ్చారు. దాదాపు 8 నెలలు సాగిన దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక సంక్షేమ శాఖలు పరిశీలన స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఇప్పటివరకు 72.7 శాతమే వెరిఫై చేశారు. 9.92 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. మరో 3.73 లక్షలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సిబ్బంది లేక పరిశీలన లేటవుతోందని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.

టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యలు, క్లియరెన్సు ఆలస్యమై..

గత విద్యా సంవత్సరం స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ రూ.2,105 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.941.05 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 1,164.4 కోట్లు ఇవ్వాలి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.2,400 కోట్లు అవసరం. నిధులను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్నా సాంకేతిక కారణాలు, బిల్లుల క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ లేటవుతుండటంతో 100 శాతం చెల్లింపులు జరగట్లేదు. ఏటా ఒకట్రెండు శాతం నిధులు పెండింగ్‌‌‌‌‌‌‌‌ పడుతూ వస్తున్నాయి. తర్వాతి ఏడాదిలోనూ వీటికి మోక్షం రాక ఇంకో ఏడాదికి యాడ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. ఇలా 2013–14 నుంచి 2017–18 వరకు రూ.287.26 కోట్లు బకాయిలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

కాలేజీలు నడపలేకపోతున్నం

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిధులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో కాలేజీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కొందరు స్టూడెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదోలా కడుతుంటే ఇంకొందరు అంత చెల్లించలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. మరోవైపు డబ్బుల్లేక కాలేజీలు నడపలేకపోతున్నామని కాలేజీల మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు చెబుతున్నాయి. ఇక కొన్ని కాలేజీలు స్టూడెంట్ల నుంచి ఫీజు వసూలు చేసి తర్వాత సర్కారు నుంచీ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇబ్బంది అవుతోంది

నేను డిగ్రీ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్న. రెండేండ్ల నుంచి ఫీజు వస్తలేదు. కాలేజీ వాళ్లేమో కట్టమంటున్నరు. చాలా ఇబ్బందైతంది. సర్కారు వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలె.

– వంశీ, డిగ్రీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌

విడుదల చేయాలె

స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ చెల్లించకుండా స్టూడెంట్లను సర్కారు ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టకపోతే మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కొంతమంది డబ్బుల్లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. సర్కారు వెంటనే ఫీజులు విడుదల చేయాలి.

-ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏబీవీపీ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌