- 30న కాలేజీల బహిష్కరణ.. కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్వో
- ఆఫీస్‌ల ముట్టడి: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను యథావిధిగా అమలు చేసి, రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను రిలీజ్చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలను బహిష్కరించి, కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం 14 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫీజులు రాక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల తెచ్చిన జీవో నెంబర్ 8, 9 ల వల్ల గందరగోళం ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యపై తాత్సార్యం చేయొద్దని, లేనిపక్షంలో జులై మొదటి వారంలో 5 లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యువజన సంఘం అధ్యక్షుడు జిలపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తిరి భీమ్రాజ్, ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
