ఐదుగురితో కమిటీ.. డిసెంబర్​లోగా ఫీజుల నియంత్రణ చట్టం!

ఐదుగురితో కమిటీ.. డిసెంబర్​లోగా ఫీజుల నియంత్రణ చట్టం!

 

  • ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు చర్యలు 
  • త్వరలో ఐదుగురితో కమిటీ.. డిసెంబర్​లోగా చట్టం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని  ప్రైవేటు, కార్పొరేట్ బడుల్లో ఫీజుల నియం త్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ఐదుగురితో కమిటీని వేయాలని నిర్ణయించింది. 2024--–25 విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో, వచ్చే ఏడాది నుంచి ఫీజులను కంట్రోల్ చేసే యోచనలో ఉంది. దీనికి అనుగుణంగా డిసెంబర్​లోనే చట్టం తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో  ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీ వేసింది. రాష్ట్రస్థాయిలోనే దాన్ని మానిటరింగ్ చేసేలా వ్యవస్థనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేల కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వాటిలో 30 లక్షలకుపైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 

గత బీఆర్ఎస్ సర్కారు కూడా ఓయూ మాజీ వీసీ ప్రొఫె సర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఈ రిపోర్టుపై నాటి కేబినేట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించినా.. ఫీజుల నియంత్రణ చట్టం కార్యరూపం దాల్చలేదు. కనీసం ఆర్డినెన్స్ కూడా తీసుకురాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఫీజుల నియంత్రణను సీరియస్ గా తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజులను కంట్రోల్ చేయాలని భావించినా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అది సాధ్యంకాలేదు. మరోపక్క ప్రైవేటు విద్యాసంస్థలు డిసెంబర్​లోనే ప్రారంభమవుతున్నాయి. దీంతో 2025–26 విద్యాసంవత్సరానికి ముందే ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన  ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డికి చేరాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.