మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం.. కూలిన140 ఏళ్ల మర్రిచెట్టు.. పూజలు చేస్తున్న గ్రామస్తులు

మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం.. కూలిన140 ఏళ్ల మర్రిచెట్టు.. పూజలు చేస్తున్న గ్రామస్తులు

మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులలో ఇళ్లు, షాపులు, పెట్రోలు బంకులపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. శుక్రవారం (మే2) తెల్లవారుజామున మహబూబాబాద్, బయ్యారం ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జిల్లా మొత్తం అతలాకుతలం అయ్యింది. బయ్యారంలో గాలివాన ధాటికి ఏకంగా 140 సంవత్సరాల ముత్యాలమ్మ మర్రి చెట్టు  నేలమట్టమైంది. వేర్లతో సహా పెకిలించి వేసినట్లు కూలిపడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

బయ్యారంలో కూలిన ముత్యాలమ్మ మర్రి చెట్టును చూడటానికి  గ్రామస్తులు తరలివచ్చారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలకు నిలయంగా ఉన్న చెట్టు కూలటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. దేవతలా భావించే మర్రి చెట్టు వద్ద పూజలు చేస్తున్నారు. చెట్టుతో తమకు ఉన్న అనుంధాన్ని, జ్ఞాపకాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ - ఇల్లెందు మధ్య రాకపోకలు బంద్:

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మహబూబాబాద్ - ఇల్లెందు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఈదురు గాలులకు బయ్యారం పెట్రోల్ బంకు, ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 

తడిసి ముద్దయిన వడ్ల రాశులు:

అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో వడ్ల రాశులు తడిసి ముద్దయ్యాయి. కోతకు వచ్చిన మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు అందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.