తమిళ చిత్రాల్లో కేవలం తమిళులే నటించాలి.. అక్కడే షూట్ చేయాలి.. ఫెఫ్సీ కొత్త షరతులు

తమిళ చిత్రాల్లో కేవలం తమిళులే నటించాలి.. అక్కడే షూట్ చేయాలి.. ఫెఫ్సీ కొత్త షరతులు

ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(FEFSI) కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక నుంచి  తమిళ చిత్రాల్లో కేవలం తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా సినిమాలను పూర్తిగా తమిళనాడులోనే చిత్రీకరించాలని ఆదేశించింది. దాంతో పాటు షూట్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే లేదా బడ్జెట్ కు మించి ఉంటే నిర్మాతలు తప్పనిసరిగా సంస్థకు వ్రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పింది.

సినిమా కథకు దర్శకుడే యజమాని అని.. కాబట్టి దానికి సంబంధించిన సమస్యలకు దర్శకుడే బాధ్యత వహించాలని ఫెఫ్సీ తెలిపింది. ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటుల జోక్యంతో ఫెఫ్సీ సభ్యులకు సినిమాలు రావడం లేదని, తమిళ సినిమాల షూటింగ్ లు తమిళనాడుకు దూరమవుతున్నాయని ఈ సందర్భంగా ఫెఫ్సీ ఆరోపించింది.

ఫెఫ్సీ తీసుకున్న నిర్ణయంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త నిబంధనలపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ.. తమ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి చెప్పారు.