
- మరికొందరికి గాయాలు
- సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో ప్రమాదం
కొమురవెల్లి, వెలుగు: ఆటో అదుపు తప్పి బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరికొందరికి గాయలైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఎస్ఐ రాజు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జగదేవపూర్ మండలం చాట్లపల్లికి చెందిన మహిళా కూలీలు కొమురవెల్లి మండలం రాంసాగర్ కు వరినాట్లు, పత్తి కలుపు తీయడానికి రోజూ వెళ్తుంటారు. గురువారం ఆటోలో 15 మంది కూలీలు ప్రయాణిస్తుండగా పోసాన్ పల్లి శివారులో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తాపడింది.
దీంతో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా భూమల్ల కనకమ్మ(55) మృతి చెందింది. మిగతా కూలీల పరిస్థితి నిలకడగా ఉంది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆటోలో పరిమితికి మించి కూలీలను తీసుకుని వేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.