ఆమె.. పిడికిలి బిగిస్తోంది

ఆమె.. పిడికిలి బిగిస్తోంది

ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు. తెలివిగానూ ఉంటారు. క్లాసు రూముల్లో ఫస్ట్​ బెంచ్​ల్లో కూర్చొనే అమ్మాయిలు ఈమధ్య ఉద్యమాల్లోనూ ముందు వరుసలోనే నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడ ఆందోళన జరిగినా వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్​యూ, జామియా మిలియా మొదలుకొని యూపీలోని అలీగఢ్​, పశ్చిమ బెంగాల్లోని జాదవ్​పూర్ వర్సిటీల్లో​ నిర్వహిస్తున్న నిరసనల్లో యాక్టివ్​గా పాల్గొంటున్నారు. భవిష్యత్తులో వీళ్లలో కొందరైనా పాలిటిక్స్​లో రాణించి పై పదవులు పొందే అవకాశాలున్నాయి. ఆడపిల్లల్ని ఎంకరేజ్​ చేయాలేగానీ, ఎంతవరకైనా ఎదిగే చాన్సుందని ఇందిరాగాంధీ మొదలుకుని నిర్మలా సీతారామన్​ వరకు నిరూపించారు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అమ్మాయిలు ఈ స్థాయిలో గళం విప్పుతుండటం గతంలో ఎప్పుడూ లేదు. ఈమధ్య ప్రతి నిరసన ప్రదర్శననీ వాళ్లే ముందుండి నడిపిస్తున్నారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని ఆగ్రహాన్ని, ఆవేదనని నినాదాల రూపంలో ఆకాశమే హద్దుగా వినిపిస్తున్నారు. ఇంతకీ.. వీళ్లెవరు?. యూనివర్సిటీల స్టూడెంట్లా? లేక, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలా?. న్యాయం కోసం తమకుతామే రోడ్ల మీదికి వస్తున్నారా?. యూత్​ కాబట్టి క్షణికావేశంలో ఇలా ప్రవర్తిస్తున్నారా?

రోజులు మారాయి 

సొసైటీ పట్ల ఆడపిల్లల్లో వస్తున్న ఈ మార్పు సహజమైనదే తప్ప వాళ్ల వెనక వ్యక్తులు గానీ పార్టీలు గానీ లేవని అనలిస్టులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లోని అమ్మాయిలు ఇలా బయటికొచ్చి నిర్భయంగా అభిప్రాయాలను వినిపిస్తుండటం ఫ్యూచర్​ పాలిటిక్స్​కి అద్దం పడుతోందని అంటున్నారు. రాజకీయాల్ని మగాళ్లు శాసించే రోజులు పోయాయని, 21వ శతాబ్దంలో ఆడవాళ్లు కీలకం కానున్నారని అభిప్రాయపడుతున్నారు. పాలిటిక్స్​లో సత్తా చూపాలని అమ్మాయిలు అనుకోవటానికి చాలా కారణాలున్నాయని వివరిస్తున్నారు.

సీఏఏతో మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ఎక్కువ నష్టమనే భయాలు నెలకొన్నాయి. వాటిపై కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది చివరికి ఆడవాళ్లకు ఓటు హక్కునూ తొలగిస్తారేమోననే వరకూ వెళ్లింది. దీంతో చావో రేవో తేల్చుకోవాలని వర్సిటీల్లో పెద్ద చదువులు చదివే అమ్మాయిలు నిర్ణయించుకున్నారు. ముందు ముందు కూడా మగవాళ్లతో సమన్యాయం దక్కాలంటే ఈ చట్ట సవరణను వ్యతిరేకించాలని తీర్మానించుకున్నారు.

అధికారిక గుర్తింపేదీ?

మన దేశంలో ఆడవాళ్ల పేరిట ఆస్తిపాస్తులు పెద్దగా ఉండవు. భూముల పట్టా పుస్తకాలు తండ్రి పేరిటో, భర్త పేరిటో ఉంటాయి. పల్లెల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటికీ నామమాత్రమే. మంత్రసానులే కాన్పులు చేస్తుండటంతో ఆడ పిల్లలకు కనీసం బర్త్​ సర్టిఫికెట్స్​ కూడా ఉండట్లేదు. బడిలో ఇచ్చే స్టడీ సర్టిఫికెట్సే దిక్కవుతున్నాయి. చదువుకోని అమ్మాయిలకు అవీ దొరకవు. అయితే, ఈ రోజుల్లో విలేజిల్లోనూ ఆడపిల్లల లిటరసీ పెరుగుతోంది. హయ్యర్​ స్టడీస్​ కోసం వాళ్లూ అర్బన్​ ఏరియాలకు వస్తూ సమాజంలోని ఈ పోకడలపై అవగాహన పొందుతున్నారు.

పర్సనల్​గా, కుటుంబ పరంగా, ఆస్తులు, పత్రాల విషయంలో సరైన గుర్తింపు దక్కకపోవటంతో ఆడవాళ్లు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. మగవాళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ప్రమాదాన్ని ప్రస్తుతం ఉన్నత విద్య చదువుతున్న యువతరం అమ్మాయిలు పసిగడుతున్నారు. ఈ విషయంలో తమ తల్లులు, అమ్మమ్మలు ఇన్నాళ్లూ పడ్డ కష్టాలను కళ్లారా చూసిన ఆడపిల్లలు ఈ పరిస్థితికి ఫుల్​స్టాప్​ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. తాము కూడా వాళ్లలాగే వివక్షకు గురికాకూడదనే అభిప్రాయానికి వచ్చేశారు.

ఇక సహించేది లేదు

తమ హక్కులకు, ఆశయాలకు భంగం కలిగించే ఏ చట్టానికీ సపోర్ట్​ చేయకూడదని, అలాంటి చర్యలను అడ్డుకొని తీరాలనే కసి నేటి తరం అమ్మాయిల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తమను తక్కువ చేసే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. ఓపెన్​గానే ఖండిస్తున్నారు. ఆడపిల్లలు ఇలా చైతన్యం కావటంలో చదువు పాత్ర ఎంతో ఉంది. పెద్ద చదువుల కోసం వాళ్లు పట్టణాలకు వస్తున్నారు. పేరెంట్స్​ తోడులేకుండా సొంతంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఒంటరిగానో లేక ఒకరిద్దరు అమ్మాయిలతో కలిసో సిటీల్లో రూమ్​లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.

సొంత అభిప్రాయాలతో ముందుకు…

ఆడపిల్లలు ఇంటికి దూరంగా హాస్టల్​లో ఉండి చదువుకుంటున్నారు. సింగిల్​గానే అయినా ధైర్యంగా కాలేజీకి వెళ్లొస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పూర్తిస్థాయిలో స్వతంత్రం అనుభవిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆడపిల్లల లైఫ్​ ఎవరి చెప్పు చేతల్లోనో కాకుండా స్వయంగా వాళ్ల కంట్రోల్లోనే ఉంటోంది. ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడుతుండటం వల్ల సొంత అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు మహిళలు వాటిని గట్టిగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలంగా ఉంటే సమర్థించడానికి, వ్యతిరేకంగా ఉన్నవాటిని  ప్రశ్నించడానికి కూడా వెనకాడట్లేదు.

టెక్నాలజీ, సర్కారు తోడు

ఆడపిల్లల్లో ఎంపవర్​మెంట్​ పెరగటానికి టెక్నాలజీ కూడా సాయపడుతోంది. చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా డిజిటల్​ అవుతుండటంతో యంగర్​ జనరేషన్లు వాటికి తగ్గట్లే అప్​డేట్​ అవుతున్నారు. ఈ మార్పులను ఒక్కోసారి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఓన్​ చేసుకుంటున్నారు. స్మార్ట్​ఫోన్లను, సోషల్ మీడియాను అనుకూలంగా మలచుకుంటున్నారు. అభిప్రాయాలను మరింత స్వేచ్ఛగా చెప్పే ఏ ఒక్క ఛాన్స్​నీ వదులుకోవట్లేదు. చదువుకునే ఆడపిల్లల సంఖ్య పెరగటం అనేది ఎప్పుడో ప్రారంభమైంది.

15 ఏళ్ల కిందట ఆరంభమైన మిడ్​ డే మీల్స్ పథకం స్కూల్స్​లో డ్రాపౌట్లను తగ్గించింది. ఈ ప్రోగ్రామ్​ వల్ల బడుల్లో ఆబ్సెంట్లు తగ్గటమే కాకుండా మగపిల్లలతో సమాన సంఖ్యలో ఆడపిల్లలు హాజరయ్యేవారు. ఈ పరిస్థితుల్లో చదువు మొదలుపెట్టిన అమ్మాయిలు ఇప్పుడు 18–25 ఏళ్ల ఏజ్​ గ్రూప్​లో ఉన్నారు. తమ స్టడీకి ఉపయోగపడిన ప్రభుత్వ పథకాలేంటి? వాటిని ఏ పార్టీ ప్రభుత్వం అమలుచేసింది? అనే విషయాలపై వాళ్లు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు. ఆ అవగాహనే అమ్మాయిల్ని ఇటీవలి ఆందోళనల వైపు నడిపిస్తోందని సామాజికవేత్తలు చెబుతున్నారు.

females are key role in 21st century says Analysts