- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులపై రూ.1400 కోట్ల భారం
- గతేడాదితో పోలిస్తే పెరిగిన ఖర్చులు
- సబ్సిడీ లేక సోయా రైతుల అవస్థలు
- ఉమ్మడి జిల్లాలో 18 లక్షల ఎకరాల్లో వానకాలం సాగు
ఆదిలాబాద్,వెలుగు: దుక్కి దున్నడం మొదలు.. దిగుబడి అమ్ముకునేవరకు రైతులకు ఇబ్బంది తప్పడంలేదు. ఏటా విత్తనాలు, ఎరువులు, కూలి తదితర ఖర్చులు పెరుగుతుండడంతో సర్కార్ ఇచ్చే రైతు బంధు ఏమూలకూ సరిపోవడంలేదు. వచ్చే దిగుబడి డబ్బులు అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి. బ్యాంకులూ క్రాప్ లోన్లు ఇవ్వడానికి కొర్రీలు పెడుతుండడంతో రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.
పెరిగిన భారం..
దుక్కి దున్నేందుకు ట్రాక్టర్ మొదలు.. చేసే రోటోవేటర్.. కూలీలు.. విత్తనాలకు.. ఎరువులు.. పురుగు మందులు ఏటా పెరుగుతున్నాయి. దీంతో రైతులు పెట్టుబడి భారంతో సతమతమవుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ రైతులపై రూ.1400 కోట్ల అదనపు భారం పడే అవకాశాలున్నాయి. పత్తి సాగు కోసం రూ.1200 కోట్లు, వరికి రూ.160 కోట్లు, సోయాపై రూ.75 కోట్లు పెట్టుబడి పెరగనుంది.
18 లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 18 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. 11 లక్షల ఎకరాల్లో పత్తి, 3.50 లక్షల ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో సోయా, మిగతా ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
విత్తనం మొదలు.. అమ్ముకునే వరకు కష్టాలే..
రెండేళ్లుగా పెట్టుబడి విపరీతంగా పెరుగుతోంది. బ్యాంకర్లూ రుణాలు ఇవ్వడంలేదు. దీంతో చాలా మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పడంలేదు. ఇటీవల ఆదిలాబాద్ లో ఓ రైతుకు పంటకు పెట్టుబడి డబ్బులు లేక.. అప్పులు పుట్టక ఆత్మహత్య చేసుకున్నాడు. మరో పక్క పత్తి విత్తనాలు వేస్తుండగా జొన్న రైతులు పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చిన పంట అమ్ముకుంటేనే వచ్చే డబ్బులతో ఖరీఫ్ చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం పంటలు కొనకపోవడంతో పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నారు.
అదనపు భారం ఇలా..
గత ఏడాది ఓ రైతు పత్తి ఏరుడు మొదలు... మార్కెట్ లో అమ్ముకునే వరకు ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 23 వేలు ఖర్చు చేశారు. పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు ఎకరానికి రూ.35 వేలు దాటే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ట్రాక్టర్ తో దుక్కిదున్నేందుకు ఎకరానికి గతంలో కంటే రూ. 500 అదనంగా, కూలీలకు గతంలో రూ.300 తీసుకుంటే ప్రస్తుతం రూ.500 (విత్తనాలు వేసేందుకు) ఆ తర్వాత ఒక్కో ఎకరానికి విత్తనాల కోసం రూ.2500, యూరియా, డీఏపీ, ఇతర ఎరువుల కోసం రూ.8 వేలు ఖర్చవుతుందంటున్నారు. కలుపు కోసం రూ.4 వేలు, పురుగు మందుల పిచికారి కోసం రూ. 4 వేలు, పత్తి ఏరడం.. మార్కెట్‍కు తరలించడానికి రూ.12 వేలు అవుతుందంటున్నారు. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల రేట్లు పెరగడంతో పంట చేతికొచ్చే సమయానికి ఎకరానికి రూ. 10 వేలు అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఈలెక్కన ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల పత్తి సాగుపై రూ.1200 కోట్ల అదనపు భారం పడనుంది.
సోయా విత్తనాలు
ప్రభుత్వం సబ్సిడీ సోయా విత్తనాలు 25 కేజీల బస్తాకు రూ.1200 కు పంపిణీ చేసేది. ఇప్పుడు సబ్సిడీ లేకపోవడంతో ఈ ఏడాది ప్రైవేట్ లో రూ. 4 వేలు చెల్లించాల్సి వస్తోంది. అంటే అదనంగా రూ.2800 ఖర్చు చేయాల్సిన పరిస్థతి. ఎకరానికి 25 కేజీల విత్తనాలు అవసరం ఉంటాయి. విత్తనాల భారంతో పాటు ఎరువులు, కూలీలు, యంత్రాల రేట్లు పెరగడంతో ఎకరానికి మరో రూ. 2500 వరకు అదనపు ఖర్చు కానుంది. మొత్తం మీద ఎకరానికి రూ. 5 వేలకు పైగాన అదనపు భారం పడనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేస్తున్నారు. ఈ లెక్కన ఎరువులు, ఇతర అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ. 75 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏపీ ధర రూ.1350, కాగా గతేడాది కంటే రూ. 100 అదనంగా పెరిగింది ఇతర అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు ధరలు 30 శాతం పెరిగాయి.
వరి 3.50 లక్షల ఎకరాల్లో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి 3.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది ఎకరం మడి దున్నేందుకు ట్రాక్టర్కు రూ. 700 నుంచి రూ. వెయ్యి, ఆ తర్వాత కేజీవీల్ రూ.1500 నుంచి రూ.1800, విత్తనాల ధరలు 10 కేజీలకు రూ. 200 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి 20 కేజీలు విత్తనాలు చల్లుతారు. అంటే రూ. 400 అదనపు భారం పడ్డట్టే. నాటు వేసేందుకు కూలీలు ఎకరానికి రూ. 5,500 తీసుకుంటున్నారు. గతేడాది రూ. 20 వేలు ఎకరానికి ఖర్చు వచ్చేది ఈ ఏడాది రూ. 25 వేలకు పైగా ఖర్చువుతుందని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన వరి రైతులపై సైతం దాదాపు రూ. 160 కోట్ల అదనపు భారం పడనుంది.
ఎకరానికి రూ. 15 వేలు ..
12 ఎకరాల్లో సోయా, ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్న.. ట్రాక్టర్లు దుక్కి, రోటోవేటర్, కూలీలు, సోయా విత్తనాల ధరలు పెరిగాయి. రెండు పంటలకు కలిపి ఈ ఏడాది ఎకరానికి అదనంగా రూ. 15 వేల పెట్టుబడి ఎక్కువ అవుతోంది.
- కుమ్మరి రాజు, బోథ్
అన్ని రేట్లు పెరిగినయ్..
ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో సోయా సాగు చేసిన. ట్రాక్టర్, కూలీలు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగినయ్. పెట్టుబడి భరించలేని పరిస్థితి ఏర్పడింది. గతం కంటే ఎకరానికి పెట్టుబడి రూ.5 నుంచి రూ. 10 వేలకు పెరిగింది. అప్పు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాం.
- రాజేశ్వర్, నర్సాపూర్
