ఆచితూచి అడుగు.. షాపింగ్లో పొదుపుకు పెద్దపీట.. బడ్జెచ్ పెంచని కస్టమర్లు

ఆచితూచి అడుగు.. షాపింగ్లో పొదుపుకు పెద్దపీట.. బడ్జెచ్ పెంచని కస్టమర్లు
  • ధరల పెరుగుదలే కారణం
  • ఆన్​లైన్​లోనూ ఆర్డర్ల వెల్లువ
  • యూగోవ్​ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:  పండుగల సమయాల్లో బాగానే ఖర్చు చేసే జనం ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  ఖర్చు పెంచకుండా, సరైన నాణ్యత, ధర ఉన్న ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రతి రూపాయికి తగిన విలువ పొందడంపై దృష్టి పెడుతున్నారు. యూగోవ్ ఇండియా ఫెస్టివ్ షాపింగ్ రిపోర్ట్ ప్రకారం.. 26 శాతం మంది తమ పాత బడ్జెట్‌‌‌‌కే కట్టుబడి ఉంటామని, ఎక్కువ ఖర్చు పెట్టబోమని వెల్లడించారు. మరో 23 శాతం మంది అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.  14 శాతం మంది మాత్రమే గత ఏడాది కంటే ఎక్కువ ఖర్చు చేస్తామని తెలిపారు. 

రిటైల్​తోపాటు ఆన్‌‌‌‌లైన్ అమ్మకాలూ జోరుగా సాగుతున్నాయి.  ఈ ఏడాది ఆన్‌‌‌‌లైన్ విక్రయాల విలువ రూ. 1.55 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది జరిగిన రూ.1.20 లక్షల కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 25–29 శాతం పెరుగుదల. కొనుగోలు పరిమాణం కంటే ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. షాపింగ్ లిస్టులో దుస్తులు టాప్​లో ఉన్నాయి. 47 శాతం మంది దుస్తులకు ప్రాధాన్యం ఇస్తుండగా, 36 శాతం మంది నిత్యావసరాలకు, స్వీట్లకు, 27 శాతం మంది నగలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  ఈసారి అమ్మకాలు పెరుగుతాయని 52 శాతం మంది దుస్తుల తయారీదారులు భావిస్తున్నారు.

గత నెల 4.54 లక్షల కార్ల సేల్​

ఆటోమొబైల్ రంగంలో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. గత నెల కార్ల సేల్స్​ 21.8 శాతం పెరిగి 4,54,574 యూనిట్లకు చేరాయి. టూవీలర్ల విక్రయాలు 13.5 శాతం పెరిగి 24,63,103 యూనిట్లకు చేరాయి. రిజిస్ట్రేషన్లు 31.82 శాతం పెరిగి 25,36,920 యూనిట్లకు ఎగిశాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా కార్లకు భారీ గిరాకీ కనిపిస్తోంది. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను కూడా భారీగా కొంటున్నారు.  పసిడి విక్రయాలు మాత్రం కాస్త నెమ్మదించాయి. బంగారం ధరలు దాదాపు 39 శాతం పెరిగి గ్రాముకు రూ.15,500 చేరుకోవడమే దీనికి కారణం. 

ఈ ఏడాది నగల ఖర్చు తగ్గించుకోవాలని 38 శాతం మంది అనుకుంటున్నారు.  ధన్‌‌‌‌తేరస్, పెళ్ళిళ్ళ సీజన్ నాటికి కొనుగోళ్ళు పుంజుకుంటాయని భావిస్తున్నారు. సబ్బులు, షాంపూలు, పేస్టుల వంటి ఫాస్ట్​మూవబుల్ కన్జూమర్​​గూడ్స్​( ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు బాగున్నాయి. ఆగస్టు–నవంబర్ మధ్య డిమాండ్ 11 శాతం పెరుగుతుందని అంచనా.  హెచ్‌‌‌‌యుఎల్, నెస్లే వంటి కంపెనీలు మంచి 
వృద్ధిని సాధించాయి.