న్యాయవ్యవస్థలో ఇంకానా..ఫ్యూడల్ ​ధోరణులు

న్యాయవ్యవస్థలో ఇంకానా..ఫ్యూడల్ ​ధోరణులు

న్యాయవ్యవస్థలో ఫ్యూడల్​ధోరణులు ఇంకా ఉన్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టు న్యాయమూర్తే చెప్పారు. జిల్లా జడ్జిలు, మేజిస్ట్రేట్​ల పట్ల పైకోర్టు న్యాయమూర్తుల ఆలోచనా విధానాల్లో మార్పులు రావాలి. ‘సబార్డినేట్​ జ్యుడీషియరీ’ అన్న పదం ఫ్యూడల్​ వ్యవస్థ అవశేషాలను ప్రతిబింబించేలా ఉంది. రాజ్యాంగాన్ని సవరించి ఆ పదబంధాన్ని తొలగించి ‘జిల్లా న్యాయవ్యవస్థ’గా మార్చాలి.

నేను రాసిన ‘కాల మహిమ’ అన్న కథలో జిల్లా జడ్జి ఓ లోకల్​ మేజిస్ట్రేట్​ను పిలిచి.. అయిదు కిలోమీటర్ల దూరానికి వెళ్లి అక్కడ నిల్చొని హైకోర్టు జడ్జికి ఆహ్వానం పలికి తీసుకురా.. అని చెబుతాడు. అందుకు ఆయన నిరాకరిస్తారు. అంతే కాదు నేను సుంకరిని కాదని కూడా జవాబు చెబుతారు. జిల్లా జడ్జి అప్పుడు దిగ్భ్రమకు గురై నెమ్మదిగా తేరుకుంటారు. ఆ జిల్లా జడ్జి, ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ కు ఆ పని అప్పగిస్తారు. ఈ కథ చదివిన చాలా మంది న్యాయమూర్తులు స్పందిస్తూ.. ‘అలా జవాబు చెప్పే పరిస్థితి ఉందా?’’ అని నన్ను అడిగారు. ప్రస్తుతం ఇది ఆలోచించాల్సిన ప్రశ్నే? 25 సంవత్సరాల క్రితం నాతో పాటు ఓ జిల్లాలో పనిచేసిన న్యాయమూర్తులకు ఈ విషయం తెలుసు. మిగతా వాళ్లకు అది ప్రశ్నే.

నేను జ్యుడీషియల్ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది మెజిస్ట్రేట్స్ ఇదే సమస్యను నా క్లాస్ లో ఓసారి ప్రస్తావించారు. కోర్టు సమయంలో కూడా అలా వెళ్లాల్సి వస్తోందని కూడా వాపోయారు. కోర్టు సమయంలో అలా వెళ్లకూడదని నేను గట్టిగా చెప్పా. ఎండలో రోడ్డు మీద కాకుండా గెస్ట్ హౌస్ దగ్గర పెద్దవాళ్లను రిసీవ్ చేసుకొమ్మని చెప్పాను. నేను అలాగే చేశానని కూడా చెప్పాను.‘‘మీ మాదిరిగా చేయడం కష్టం సార్. మీకు నడిచింది కానీ మాకు నడవదు”అని అన్నారు వాళ్లు. అలా ఎందుకు అనుకున్నారో తెలియదు. నేను మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు నేనూ వాళ్ల లాంటి వ్యక్తినే. న్యాయ వ్యవస్థలో నాకెవరూ గాడ్ ఫాదర్లు లేరు. 

జస్టిస్​ చంద్రచూడ్​ మాటల్లో..

ప్రస్తుతం న్యాయవ్యవస్థలో పరిస్థితులు మరీ దారుణంగా మారిపోయాయి. ఈ మాట నేను అంటున్నది కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​డీవై చంద్రచూడ్ అన్నారు. కొన్ని నెలల్లో ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఈ మధ్య గుజరాత్ హైకోర్టు ఏర్పాటు చేసిన ఓ జాతీయ సదస్సులో ఆయన స్పందిస్తూ.. ‘‘భారత న్యాయవ్యవస్థలో భూస్వామ్య ధోరణులు నేటికీ ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు. అవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా న్యాయమూర్తులతో, ఇంకా ఇతర న్యాయమూర్తులతో మనం వ్యవహరిస్తున్న తీరులో ఈ ధోరణి కనిపిస్తోంది. జిల్లా సరిహద్దుల దగ్గర ఆ జిల్లాకు చెందిన న్యాయమూర్తులు వేచి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. పైకోర్టు న్యాయమూర్తులు ఎప్పుడు వస్తారా.. అని నిరీక్షిస్తున్న తీరు మన ఎరుకలో ఉన్నదే. అంతేకాదు జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడేటప్పుడు వాళ్లని కూర్చోనివ్వరు. ఇవన్నీ జిల్లా న్యాయ వ్యవస్థ  సబార్డినేషన్ కు గుర్తులు. ఈ భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు న్యాయవాదులు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.

రాజ్యాంగంలోనూ..

కారణం తెలియదు కానీ జిల్లా న్యాయ వ్యవస్థను రాజ్యాంగంలో సబార్డినేట్ జ్యుడీషియరిగా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆరో అధ్యాయంలో ‘సబార్డినేట్ కోర్టులు’ అన్న వ్యక్తీకరణ ఉంది. నిజానికి న్యాయమూర్తి స్వతంత్రుడు. సబార్డినేట్ జ్యుడీషియరి అన్న పదబంధం అసంబద్ధమైనది. ప్రమాదకరమైనది కూడా. అది ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలను ప్రతిబింబించేలా ఉంది. ఈ పద బంధాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ ఉపేంద్ర భక్షీ లాంటి వాళ్లు తరచూ అంటున్నారు. నిజానికి న్యాయమూర్తి ఎవరూ తక్కువ కాదు ఎక్కువ కాదు. వారు ఎవరి ఆధీనంలో కూడా లేరు. అప్పీలు రివిజన్ల ద్వారా కింది కోర్టు ఉత్తర్వులను తీర్పులను పైకోర్టులు రద్దు చేయవచ్చు, మార్చవచ్చు. అంతే గానీ వాటిని తక్కువగా చేయకూడదు. ఆర్టికల్ 235లో చెప్పిన వాటికి అనుగుణంగా హైకోర్టులు పాలనా, పర్యవేక్షణ అధికారాలను కలిగి ఉంటాయి. ప్రొఫెసర్ భక్షీ  ప్రకారం.. ఆర్టికల్​235కి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టు నియంత్రణ అన్న విస్తృత అర్థాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యవేక్షణ అధికారాలు హైకోర్టుకు ఇస్తే బాగుంటుంది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సంజీవ్ బెనర్జీ తన వీడ్కోలు సభలో మాట్లాడుతూ.. ‘‘న్యాయవ్యవస్థలో నెలకొన్న ఈ ఫ్యూడల్ సంస్కృతిని నేను నాశనం చేయనందుకు బాధ పడుతున్నాను’’ అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు సబార్డినేట్ కోర్టులు అన్న పదాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నాయి. మిగతా హైకోర్టులు కూడా ఈ సంస్కృతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. 

న్యాయమూర్తుల తీరు..

జిల్లాల్లో పనిచేసే న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలి. సబార్డినేషన్ అన్న పదానికి స్థానం ఉండకూడదు. ఫ్యూడలిజం రోజులు పోయాయి అని మనం అనుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామని కూడా అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా అలా ఉందా? న్యాయవ్యవస్థలోనే కాదు అన్ని వ్యవస్థల్లో దాని అవశేషాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఫ్యూడలిజం ధోరణులు ఉన్న వ్యక్తులు పైవాళ్ళతో నమ్రతగా, కింది వాళ్లను అణగదొక్కే విధంగా ఉంటారు.  ‘‘జిల్లా న్యాయవ్యవస్థను కించపర్చేది బయటి వ్యక్తులు కాదు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వ్యక్తులే. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది’’ అని పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కమల్ జిత్ సింగ్ గరేవాల్ అన్నారు. న్యాయవ్యవస్థలో భూస్వామ్య ధోరణులను అంతం చేసేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘న్యాయమూర్తులందరూ సమానమే. రాజ్యాంగాన్ని సవరించి.. ‘సబార్డినేట్ కోర్టుల’ అన్న పదబంధాన్ని తొలగించి ‘జిల్లా న్యాయవ్యవస్థ’గా మార్చాలి’ అని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి అన్నట్టు రాజ్యాంగ సవరణ కన్నా ముందు పైకోర్టు న్యాయమూర్తుల ఆలోచనా ధోరణుల్లో మార్పులు రావాలి. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు ఈ విషయాన్ని ఆలోచించాలి. జిల్లా న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులను గౌరవిస్తేనే తమ గౌరవం పెరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 

సబార్డినేట్​ అనే పదమే..

నేను ఉద్యోగంలో చేరినప్పుడు సబార్డినేట్ జడ్జి అని ఓ పదవి ఉండేది. ఆ పేరులోనే ఫ్యూడల్ లక్షణం ఉంది. కాలక్రమంలో అది సీనియర్ సివిల్ జడ్జిగా మారిపోయింది. నిజానికి తీర్పులు చెప్పే క్రమంలో సబ్ ఆర్డినేషన్ ఉండదు. ప్రతి న్యాయమూర్తి తన పరిధిలో స్వతంత్రంగా పని చేస్తారు. పని చేయడానికి అవకాశం ఉంది. సీనియర్ జడ్జి తన జూనియర్ జడ్జిని ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయమని, ఫలానా విధంగా నిర్ణయించమని చెప్పడానికి అవకాశం లేదు. న్యాయమూర్తులు పోలీస్, సాయుధ దళ సభ్యులు కాదు. తమ విధులు నిర్వర్తించడానికి పైఅధికారుల నుంచి వారికి ఆదేశాలు రానవసరం లేదు. చట్టాలు, శాసనాల నుంచి వారికి ఆ అధికారాలు వచ్చాయి. అధికారాలు పొందుతారు కూడా. న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి మాదిరిగానే స్వతంత్రత కలిగి ఉంటారు. పాలనాపరంగా సబార్డినేషన్ ఉంటుంది. 
- మంగారి రాజేందర్, మాజీ డైరెక్టర్, జ్యుడీషియల్​ అకాడమీ

 

ఇవి కూడా చదవండి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు

వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం