జ్వరమొచ్చింది..జ్వరపీడితులతో బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి కిటకిట

జ్వరమొచ్చింది..జ్వరపీడితులతో బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి కిటకిట
  • చికిత్సకు వచ్చిన 610 మందిలో 400 మంది జ్వర బాధితులే..
  • 100 పడకలకు 136 మంది ఇన్ పేషెంట్లు.. వీరిలో జ్వరం సోకిన వారు 90 మంది
  • ఒక్క బెడ్డుపై ఇద్దరికి ట్రీట్​మెంట్
  • సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోయినా నెట్టుకొస్తున్న వైనం

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. ఆస్పత్రి బెడ్లు, ప్రాంగణంలో ఎక్కడ చూసినా జ్వరంతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో 80 శాతానికిపైగా రోగులు జ్వరాలతో బాధ పడుతున్న వారే. వీరిలో చిన్న పిల్లలు చాలా మందే ఉన్నారు. మంగళవారం ఆస్పత్రికి 610 మంది రోగులు వైద్య చికిత్సల కోసం రాగా వీరిలో  దాదాపు 400 మందికి పైగా జ్వరం సోకిన వారే. 100 పడకల ఈ ప్రాంతీయ ఆస్పత్రితో ఇన్ పేషెంట్లుగా 136 మంది చికిత్స పొందుతున్నారు. 

వీరిలో 25 మంది టైఫాయిడ్, మరో 20 మలేరియా జ్వరపీడితులున్నారు. మిగతా అందరూ వైరల్​ఫీవర్లతో బాధపడుతున్నారు. బెల్లంపల్లి పట్టణంతోపాటు రూరల్, నెన్నెల, భీమిని, తాండూర్, కాసిపేట,కన్నెపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, బెజ్జూర్, కౌటాల, రెబ్బన, తిర్యాని, పెంచికల్ పేట, సిర్పూర్ (టీ) తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు..

42 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ఐదుగురే..

అయితే ఏరియా ఆస్పత్రికి ఇప్పటివరకు డాక్టర్లు, సిబ్బందిని కేటాయించలేదు. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు చెందిన 8 మంది డాక్టర్లు ఇక్కడ పనిస్తున్నారు. కాగా వీరిలో ముగ్గురు డిప్యూటేషన్ పై వెళ్లగా ప్రస్తుతం కేవలం ఐదుగురు డాక్టర్లతోనే ఆస్పత్రిని నెట్టుకొస్తున్నారు. ఏరియా 100 పడకల ఆస్పత్రిలో 42 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.. స్టాఫ్ నర్సు లు34 మందికి ప్రస్తుతం 9 మంది,  మిగతా సిబ్బంది 80 మందికి 40 మంది పనిచేస్తున్నారు. వచ్చిన రోగులను వెనక్కి పంపకుండా సామర్థ్యానికి మించి వైద్య సేవలు అందిస్తున్నారు. 

ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం.

ఆస్పత్రికి ఎప్పుడు లేనంతగా భారీ సంఖ్యలో రోగుల తాకిడి పెరిగింది. ఒక్క మంగళవారం నాడే 610 మంది రోగులకు వైద్యం అందించాం. అన్ని రకాల మందులు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది, క్యాడర్, స్ట్రెంగ్త్ జీవో రాకపోవడంతో చాలీచాలని 30 పడకల సిబ్బంది, డాక్టర్లతో మెరుగైన వైద్యసేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం.  – జీడీ రవికుమార్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్