ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను మర్చిన నగర జనం

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను మర్చిన నగర జనం

పాదాచారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పిస్తున్నా వాటిని ఉపయోగించుకోవడంలో మాత్రం జనం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లు, జంక్షన్లను సురక్షితంగా దాటేందుకు సర్కారు నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (ఎఫ్‌వోబీ)ను అందుబాటులోకి తెచ్చింది. కానీ అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నగర జనం మర్చిపోయారు. దీంతో రోడ్డు ప్రమాదాలను నివారించడం ట్రాఫిక్ పోలీసులకు మరింత కష్టంగా మారింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3లో, పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ మాల్‌లో, బేగంపేటలోని ప్లాజా హోటల్‌కి సమీపంలో ఉన్న అన్ని ఎఫ్‌ఓబీ దగ్గరా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాదచారులు సురక్షితంగా, హాయిగా రోడ్డు దాటడానికి ఎఫ్‌వోబీలకు రోడ్డుపై నడుస్తూ వాహనాలకు ఇబ్బందిగా మారుతోంది. అంతే కాదు దీని వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.

నగరంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా ఎఫ్‌వోబీల క్రింద, పాదచారులు మొబైల్ ఫోన్‌లలో మాట్లాడుకుంటూ, ప్రమాదాలను పట్టించుకోకుండా రోడ్లు దాటుతున్నారు. ఇది మరింత ఆందోళనను కలిగిస్తోంది. అయితే ప్రజలకు వీటిపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని, రోడ్డు దాటేటప్పుడు ఖచ్చితంగా ఎఫ్‌వోబీలను ఉపయోగించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. పాదచారుల భద్రత కోసం ప్రభుత్వం రూ.76.65 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 22 ఎఫ్‌ఓబీలను ప్రతిపాదించింది. వాటిలో ఇప్పటి వరకు తొమ్మిది పూర్తికాగా మిగిలిన పనులు చివరి దశలో ఉన్నాయి. వృద్ధులు, వికలాంగుల కోసం, ఎఫ్‌వోబీలలో మెట్లతోపాటు ఎలివేటర్లు, ఎస్కలేటర్‌లు కూడా ఏర్పాటు చేశారు.