వ్యాపార కెరటం సైరస్ మిస్త్రీ ఇక లేరు

వ్యాపార కెరటం సైరస్ మిస్త్రీ ఇక లేరు

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనది వంతెనపై డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే సైరస్ మృతిచెందారు. కారు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన మృతి పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

2012లో రతన్ టాటాకు వ్యాపార వారసుడిగా.. 

రతన్ టాటాకు 2012 సంవత్సరంలో 75 ఏళ్ల వయసు నిండింది.. దీంతో ఆయన టాటా సన్స్ గ్రూప్  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. దీంతో రతన్ టాటా స్థానంలో టాటా సన్స్ గ్రూప్ కు ఆరో చైర్మన్ హోదాలో సైరస్ మిస్త్రీ పగ్గాలు చేపట్టారు.  సైరస్ మిస్త్రీ కుటుంబం కూడా వ్యాపార నేపథ్యం కలిగినదే. షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, దివంగత పల్లోంజీ మిస్త్రీ చిన్న కుమారుడే సైరస్ మిస్త్రీ. టాటా సన్స్ లోని అత్యధిక వాటాలు (18.37 శాతం) కలిగిన సంస్థల్లో షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్  ఒకటి. టాటా సన్స్ చైర్మన్ పదవి అనేది సైరస్ కు నేరుగా దక్కలేదు. అంత సులభంగా దాన్ని ఆయనకు కేటాయించలేదు. 

1994లో అలా మొదలై.. 

తొలిసారిగా 1994 సంవత్సరంలో 26 ఏళ్ల వయసులో తన కుటుంబానికి చెందిన షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో డైరెక్టర్ గా వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల అనుభవం తర్వాత.. 2006 సంవత్సరంలో డైరెక్టర్ హోదాలో టాటా గ్రూప్ లో తన ప్రస్థానాన్ని సైరస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత తన పనితీరును నిరూపించుకుంటూ.. టాటా గ్రూప్ కు చెందిన వివిధ కంపెనీల్లో నానా ఎగ్జిక్యూటివ్ హోదాల్లో సైరస్ సేవలు అందించారు.  ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రతన్ టాటాకు వ్యాపార వారసుడిగా టాటా గ్రూప్ వాటాదారులు ఊహించుకునే స్థాయికి సైరస్ ఎదిగారు. అందువల్లే ఆయనకు ఆ గొప్ప చాన్స్ లభించింది. టాటా కుటుంబం కాకుండా అవతలి నుంచి టాటా గ్రూప్ కు సారథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్న రెండో వ్యక్తిగా సైరస్ మిస్త్రీ రికార్డును నెలకొల్పారు. 

నాటకీయ పరిణామాల నడుమ.. 

అయితే సైరస్ కేవలం నాలుగే సంవత్సరాల పాటు (2012 నుంచి 2016 వరకు) టాటా సన్స్  గ్రూప్ చైర్మన్ హోదాలో కొనసాగగలిగారు. 2016 అక్టోబరులో నాటకీయ పరిణామాల నడుమ సైరస్ మిస్త్రీ టాటా సన్స్ చైర్మన్ పదవిని కోల్పోయారు.  ఆయనకు నిర్దేశించిన వివిధ లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో గ్రూపు ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న వాదనలూ ఉన్నాయి. అయితే దీనిపై  2016 డిసెంబరులో  సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన రెండు కంపెనీలు (సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెమెంట్స్) నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. రతన్‌ టాటాతో పాటు టాటా సన్స్‌లోని మరో 20 మందిపైనా కేసు దాఖలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను పరిశీలించడానికి సైతం అర్హత లేదని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. అయితే మిస్త్రీ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు సైరస్‌మిస్త్రీని వరించింది.   దీంతో టాటా సన్స్ 2017 ఫిబ్రవరిలో మరో కఠిన నిర్ణయం తీసుకుంది. సైరస్ మిస్త్రీని టాటా సన్స్ కంపెనీ బోర్డు  డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

26 ఏళ్ల వయసు నుంచే.. 

సైరస్ మిస్త్రీ 1968 జులై 4న ముంబైలో జన్మించారు. షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, దివంగత పల్లోంజీ మిస్త్రీ చిన్న కుమారుడే సైరస్. ఆయన తల్లి పేరు ప్యాట్ పెరిన్ డుబాష్. ఆమె ఐర్లాండ్ వనిత. దీంతో సైరస్ మిస్త్రీకి పుట్టుకతోనే ఐరిష్ పౌరసత్వం కూడా లభించింది.1990 సంవత్సరంలో లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ ను సైరస్ పూర్తి చేశారు. అనంతరం 1997లో లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎమ్మెస్సీ ఇన్ మేనేజ్మెంట్ కోర్సును చేశారు. 1994 సంవత్సరంలో 26 ఏళ్ల వయసులో తన కుటుంబానికి చెందిన షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో డైరెక్టర్ గా వ్యాపార ప్రస్థానాన్ని సైరస్ ప్రారంభించారు. ఈక్రమంలో నిర్మాణ రంగ కార్యకలాపాలను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు విస్తరించారు. ఫలితంగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 23వేలకు పెరిగింది. ఇక సైరస్ మిస్త్రీకి ఇద్దరు సోదరీమణులు లైలా, ఆలూ. సైరస్ మిస్త్రీ సోదరి ఆలూ మిస్త్రీని నోయల్ టాటా పెళ్లి చేసుకున్నారు.  సైరస్ కు గుర్రపు రేసింగ్ అంటే చాలా ఇష్టం.