
- సీఎం రేవంత్ రెడ్డికి ఎఫ్ జీజీ వినతి
హైదరాబాద్, వెలుగు : పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి తగ్గించేందుకు రాష్ట్రంలో భద్రతా కమిషన్, పోలీస్ కంప్లయింట్ ఆథారిటీని ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సోమవారం లేఖ రాశారు. ఈ కమిషన్లో సీఎం లేదా హోం మంత్రి ప్రెసిడెంట్గా, డీజీపీ సెక్రటరీగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, హైకోర్టు సీజే లేదా ఆయన సూచించిన రిటైర్డ్ జడ్జి ఉండాలని సుప్రీంకోర్టు సూచించిందని లేఖలో గుర్తు చేశారు. 2021 లో కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే విచారణ టైమ్లో కమిషన్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందని
ఆపై దాటవేసిందని వివరించారు. జిల్లాలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ, రాష్ట్రస్థాయిలో ఎస్పీ నుంచి పైస్థాయి అధికారులపై ఫిర్యాదులు తీసుకునేందుకు పోలీస్ కంప్లయింట్ అథారిటీ పనిచేస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. గత పాలకులు పోలీస్ శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఇటీవల బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. రిటైర్డ్ పోలీసు అధికారులను ఓఎస్డీలుగా నియమించి ఎన్నో అక్రమాలకు గత పాలకులు పాల్పడ్డారని ఆరోపించారు.