వాటర్ ట్యాంక్​ ఎక్కి.. మాజీ ఫీల్డ్ ​అసిస్టెంట్ నిరసన

వాటర్ ట్యాంక్​ ఎక్కి.. మాజీ ఫీల్డ్ ​అసిస్టెంట్ నిరసన

మెదక్/రేగోడ్, వెలుగు: ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం తనకు కాకుండా మరొకరికి ఇచ్చారంటూ మాజీ మహిళా ఫీల్డ్​అసిస్టెంట్​ వాటర్​ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపింది. గతంలో తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్​అసిస్టెంట్లను తిరిగి డ్యూటీలోకి తీసుకుంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మెదక్ జిల్లా రేగోడ్​ మండలం ఫీల్డ్​అసిస్టెంట్ల జాబితాలో తన పేరుకు బదులు మాజీ సర్పంచ్​తమ్ముడి పేరు చేర్చారని మర్పల్లి మాజీ ఫీల్డ్​అసిస్టెంట్​ బిత్తరి సుజాత ఆరోపించింది. తాను 2006 నుంచి ఫీల్డ్​అసిస్టెంట్​గా పని చేస్తున్నానని, అనారోగ్య కారణాలతో కొంతకాలం డ్యూటీ చేయలేదన్నారు. దీనిని సాకుగా చూపి జాబితాలో నుంచి తన పేరు తొలగించారని తెలిపింది.

కలెక్టర్​ను కలిస్తే ఎంపీడీఓను కలవమన్నారని, ఆమెను కలిస్తే లిస్ట్​లో ఎవరి పేరుందో వారికి ఆర్డర్ ​కాపీ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొంది. తనను ఉద్యోగంలోకి తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వకుంటే వాటర్​ట్యాంక్​ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్యాంక్​ మీదనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.

అల్లాదుర్గం సీఐ జార్జ్ ఘటనా స్థలానికి చేరుకొని సుజాతతో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పడంతో కిందకు దిగి వచ్చింది. అనంతరం సీఐ మాట్లాడుతూ తాను డీఆర్డీఓతో మాట్లాడానని, సమ్మెలో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రమే డ్యూటీలోకి తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని ఆయన చెప్పారని తెలిపారు. సుజాత సరైన కారణాలు, ఆధారాలు సమర్పిస్తే విచారణ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇవ్వగలమని పేర్కొన్నారని చెప్పారు.