ఎక్కడికి వెళ్లినా.. మంత్రులకు ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన సెగ తగులుతూనే ఉంది. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వైరా పర్యటనకు వెళ్లిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మంత్రులను డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
కాగా, అంతకు ముందు ఖమ్మం నగరంలోని 20 వ డివిజన్ లో 88 మంది అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేశారు మంత్రి పువ్వాడ అజయ్. నగరంలో 2 వేల మంది నిరుపేదలకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదుర్కొంటున్న ఇళ్ళ పట్టాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని పువ్వాడ అజయ్ తెలిపారు.
