డ్యూటీలోకి ఫీల్డ్ అసిస్టెంట్లు

డ్యూటీలోకి ఫీల్డ్ అసిస్టెంట్లు

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం డ్యూటీలో చేరారు. 2020 ఫిబ్రవరి నాటికి డ్యూటీలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు కలెక్టర్లు, డీఆర్డీఏలు వారిని జాబ్ లో జాయిన్ చేసుకున్నారు. గతంలో సస్పెన్షన్, అబ్ స్కాండింగ్, ఇతరాత్ర కారణాలతో రిజైన్ చేసిన, రిమూవ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం దూరం పెట్టారు. వీరంతా పంచాయతీ సెక్రటరీల పర్యవేక్షణలో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

2020 మార్చిలో సమ్మె
తమకు జీతం పెంచాలని, తక్కువ పనిదినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలనే సర్క్యులర్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో 2020 మార్చిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. సమ్మె చేస్తున్న క్రమంలోనే కరోనా విజృంభించడంతో సామాజిక బాధ్యతగా భావించి పది రోజుల్లోనే సమ్మెను విరమించారు. అయినా ప్రభుత్వం వారిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో అప్పటి నుంచి తమను విధుల్లోకి తీసుకోవాలని కనిపించిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ ఏడాది మార్చి 15న బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఎట్టకేలకు బుధవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల డీఆర్డీఏలకు ఆదేశాలివ్వడంపై ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర నేత ముదిగొండ శ్యామలయ్య హర్షం వ్యక్తం చేశారు.

విధుల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు
విధుల్లోకి తీసుకున్నందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కేసీఆర్ కు, పంచాయతీ రాజ్ మంత్రి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. 29 నెలలుగా జీతాల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని, కొంత మంది చనిపోయారని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర నేతలు కృపాకర్, శ్రీను, రవి, లక్ష్మణ్ , భాగ్యలక్ష్మి అన్నారు. విధుల్లోకి తొలగించకముందుకు 3 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, అవి కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పనిభారం తగ్గించిండ్రు
29 నెలలుగా ఫీల్డ్ అసిసెంట్లు లేకపోవటంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సంఘం నేతలు మహేశ్, మధుసూదన్​రెడ్డి, విజయ్ కుమార్ గుర్తు చేశారు. ఫీల్డ్ అసిసెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఎంతో కాలంగా మంత్రి దయాకర్ రావును, పంచాయతీ రాజ్ అధికారులను కోరుతున్నామని తెలిపారు. నేటి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నందుకు కేసీఆర్, దయాకర్​రావుకు ధన్యవాదాలు తెలిపారు.