సిద్దిపేట కాంగ్రెస్లో పోటాపోటీ.. 15 దరఖాస్తుల రాక

 సిద్దిపేట కాంగ్రెస్లో పోటాపోటీ.. 15 దరఖాస్తుల రాక
  • 15 దరఖాస్తుల రాక.. టికెట్ పై ఎవరీ ధీమా వారిదే
  • తెరపైకి ‘స్థానికత’..బీసీ అభ్యర్థికే  చాన్స్!
  • రాజధానిలో ఆశావహుల మకాం 

సిద్దిపేట, వెలుగు : ఈసారి సిద్దిపేట  కాంగ్రెస్ టికెట్ కు తీవ్ర పోటీ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా టికెట్ కోసం 15 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఏనాడూ ఐక్యంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారు సైతం ఇప్పుడు టికెట్ కోసం పోటీ పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దరఖాస్తుదారుల్లో సగానికి పైగా టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు.

ఓటు బ్యాంక్​ ఉన్నా.. 

సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నా సరైన నాయకత్వం లేక చాలా కాలంగా చతికిలపడింది. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి ప్రాతనిథ్యం కరవువైంది. 1983 లో మదన్ మోహన్ గెలిచిన తరువాత ఇప్పటి వరకు సిద్దిపేట స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించక పోగా క్రమంగా బలహీన పడుతూ వస్తోంది.  1985 నుంచి ఆరు సార్లు కేసీఆర్, 2004 ఉప ఎన్నిక నుంచి హరీశ్​ రావు ఆరుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు  ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. 1985 నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసినా 2004 లో టీఆర్ఎస్ తో పొత్తు కారణంగా రెండుసార్లు,   2018 లో టీజేఎస్ తో పొత్తు కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి నిలబడలేదు. 

సిద్దిపేట సెగ్మెంట్ లో కాంగ్రెస్ పాటీకి 20 వేల ఓటు బ్యాంకు ఉన్నా బరిలో నిలిచిన అభ్యర్థుల ను బట్టి అవి వారి పక్షాన పోలవుతూవస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో   2009  జరిగిన ఉప ఎన్నికలో  కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యకు 21,166 ఓట్లు రాగా, 2001 లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మూడు వేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.

మళ్లీ బీసీ అభ్యర్థికే.. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఉద్దేశంతో ఉన్న పీసీసీ సిద్దిపేటలో బీసీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో  10 మంది బీసీలే ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో  బీసీ అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దించింది. 2008, 2010 ఉప ఎన్నికల్లో, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థులు భైరి అంజయ్య, తాడూరి శ్రీనివాస గౌడ్ పోటీ చేశారు.  సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,23,960 ఓట్లలో పురుషులు 1,11,227, మహిళలు 1,12,721 మంది ఉన్నారు.  మొత్తం ఓట్లలో పురుషుల కంటే 1494  మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి.  సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్​ లో 20 శాతం ముదిరాజ్ ఓటర్లుండగా  గౌడ, పద్మశాలీ, యాదవ ఓటర్లను కలుపుకుంటే  సగానికి పైగా  బీసీ ఓటర్లే వుంటారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించే చాన్స్​  ఉంది. దాదాపు 20 వేల సంప్రదాయ ఓటర్ల తోపాటు ప్రభుత్వ వ్యతిరేకత తమకు సానుకూలంగా మారుతుందనే ఆశతో ఉన్నారు. ఇదిలా ఉండగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో కోవర్టు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని, అందువల్లే అత్యధికంగా టికెట్ కు దరఖాస్తులు అందాయనే ప్రచారం నడుస్తోంది. 

‘గాడ్ ఫాదర్స్’తో ప్రయత్నాలు

సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు తమ గాడ్ ఫాదర్స్ తో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజధానిలోనే మకాం వేసి ఎలాగైనా తమకే టికెట్ దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలైన దామోదర రాజనరసింహ, మహేశ్ కుమార్ గౌడ్, వి.హన్మంతరావు, జగ్గారెడ్డిని కలసి తమకే టికెట్​ ఇప్పించాలని కోరుతున్నారు. మరో రెండు రోజుల్లో అందిన దరఖాస్తుల్లో నుంచి ఐదుగురితో షార్ట్ లిస్ట్ చేసే అవకాశాలుండటంతో పలువురు హైదరాబాద్ లోనే ఉండి తమదైన శైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

‘స్థానికత’లో మాత్రం ఐక్యత.. 

సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ సీటును స్థానికులకే కేటాయించాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మరికంటి భవాని మినహా మిగిలిన వారంతా సిద్దిపేటకే చెందిన వారు కావడంతో ఈ విషయంలో మాత్రం అందరూ ఐక్యంగా ఉన్నారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి విష్ణునాథ్ పర్యటన సందర్బంగా ప్రత్యేకంగా వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. మహిళా కోటా కింద మరికంటి భవానికి టికెట్ దక్కే అవకాశం వుండటంతో దీన్ని అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా స్థానికతను ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న భవాని 2018 ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 12వేల ఓట్లను తెచ్చుకుంది. కొద్ది కాలం కింద కాంగ్రెస్ లో చేరిన భవాని తిరిగి సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ రేసులో ఉంది.