
- తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్
- వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆందోళన
- గుట్టపై పోలీస్ బందోబస్తు
యాదాద్రి ఆలయ రాతిస్తంభాలపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు, చెక్కడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దేవుడి సన్నిధిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణాన్ని కూడా రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. హిందూ దేవాలయంలో స్తంభంపై చార్మినార్ చిత్రం ఏర్పాటు చేయడమేంటని మండిపడుతున్నారు. ఇది హిందూ మత విశ్వాలను అగౌరవపరచడమేనని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, దేవాలయ పరిరక్షణ సమితికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గుట్టపై ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆలయం పక్కనే ఉన్న మొదటి రాతి స్తంభంపైనే సీఎం కేసీఆర్ చిత్రం చెక్కారు. ఆ తరువాత వరుసగా స్తంభాలపై టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు, చార్మినార్, సర్కారు అమలు చేస్తున్న పథకాల చిత్రాలను చెక్కారు. దీనిపై తీవ్ర అలజడి రేగింది. కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ బీర్ల అయిలయ్య, బీజేపీ నాయకురాలు బండ్రు శోభారాణి, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నేతలు శుక్రవారం కొండపైకి చేరుకున్నారు. కేసీఆర్, కారు, చార్మినార్ చిత్రాలు ఉన్న రాతి స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడెవరూ మాట్లాడవద్దని, బయటకు వెళ్లి పోవాలని పోలీసులు సూచించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల, వివిధ సంఘాల నేతలు అక్కడే బైఠాయించారు.
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆందోళన
యాదాద్రి స్తంభాలపై కేసీఆర్, కారు, చార్మినార్ చిత్రాలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నేతలు కొండపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. రాతి స్తంభాలను పరిశీలించడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు రాతి స్తంభాలను పరిశీలించడానికి ఐదుగురితో కూడిన బృందాన్ని అనుమతించారు. అనంతరం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నేతలు మాట్లాడుతూ స్తంభాలపై ఉన్న కేసీఆర్, కారు గుర్తు, చార్మినార్ సహా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారి చిత్రాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక చిహ్నాలు తప్ప మరేవీ ఉండకూడదన్నారు.
రాజ్యాలు కనుమరుగైనా..
సీఎం కేసీఆర్ ఇంకా తాను రాచరిక వ్యవస్థలో ఉన్నానని, తానో మహరాజునని అనుకుంటున్నారనీ, అందుకే దేవాలయ స్థంభాలపై బొమ్మలను చెక్కించుకుంటున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తన బొమ్మలను చెక్కించుకోవడం ద్వారా కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
గుడిని కళంకితం చేస్తున్నారు
యాదగిరిగుట్టలో నర్సింహస్వామి గుడిని సీఎం కేసీఆర్ కళంకితం చేస్తున్నారనీ, శిలలపై ఆయన చిత్రపటాన్ని తక్షణం తొలగించకపోతే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి హెచ్చరించారు.
నీ చరిత్ర మాకొద్దు కేసీఆర్
‘కేసీఆర్. నీ చరిత్ర మాకు అవసరం లేదు. యాదాద్రి చరిత్ర మాత్రమే భక్తులకు కావాలి. నీ బొమ్మలు ఫామ్‌హౌస్‌లో పెట్టుకో’ అని బీజేపీ నాయకురాలు బండ్రు శోభారాణి, దేవాలయ పరిరక్షణ సమితి, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు అన్నారు. తన, తనపార్టీ గుర్తు, పథకాల బొమ్మలు చెక్కించి కేసీఆర్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఆయన చిత్రాలను తొలగించకుంటే ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడేది లేదన్నారు.
నేడు యాదాద్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
యాదాద్రి ఆలయ అష్టబుజి మండపాలపై కేసీఆర్, ప్రభుత్వ పథకాలను తెలిపే చిత్రాలను చెక్కించడంపై పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం వస్తున్నారన్నారు.
నియంతృత్వానికి పరాకాష్ట
యాదాద్రి లక్ష్మీనర్సిహస్వామి ఆలయ నిర్మాణంలో రాజకీయాలకు చోటిచ్చే విధంగా శిల్పాలపై తన బొమ్మ చెక్కించుకొని సీఎం కేసీఆర్ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పవిత్ర పుణ్య క్షేత్రాన్ని వ్యక్తిగత ప్రతిష్ట కోసం వాడుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణికి ఇది పరాకాష్ట అన్నారు. శతాబ్దాల చరిత్ర చూసినా ఏ దేవాలయంలోనూ ఇలాంటి శిల్పాలు కనిపించవని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చర్యలను ధార్మిక సంస్థల అధిపతులు, మేధావులందరూ ఖండించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాతి స్తంభాలపై ఆ బొమ్మలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.