రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరి తిని పదిహేను మందికి పైగా చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.పానీపూరి తిన్న కాసేపటికే చిన్నారులంతా ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పిల్లలను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు.
అయితే, బాధితుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.అసలు చిన్నారుల అస్వస్థతకు పానీపూరి తినడమే కారణమా..? లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా ఇది ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది విచారణ చేపట్టారు. కాలనీలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు, తమ పిల్లలు అస్వస్థతకు గురికావడంతో కేసీఆర్ నగర్ కాలనీలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చిన్నారుల అనారోగ్యానికి అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి వైద్య పరీక్షల నివేదికలు వస్తేనే అసలు నిజాలు బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు.
