విశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

విశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైజాగ్‌లో అడుగుపెట్టనీయబోమని YCP కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పేందుకు TDP శ్రేణులు కూడా భారీగా తరలిచ్చాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు కలగజేసుకుని వారిని చెదరగొట్టారు. ముందుజాగ్రత్తగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. YCP, TDP ఆందోళనలతో విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా పెందుర్తి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.అయితే ర్యాలీకి విశాఖ పోలీసులు అనుమతించలేదు. పెందుర్తి భూసమీకరణ బాధితులను పరామర్శించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మాత్రమే మంజూరు చేసింది. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఇతర నేతలు 50 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు.