అంజన్న పుణ్య క్షేత్రం కొండగట్టులో అన్నదానం టోకెన్ల కోసం తోపులాట

అంజన్న పుణ్య క్షేత్రం కొండగట్టులో అన్నదానం టోకెన్ల కోసం తోపులాట

జగిత్యాల జిల్లా: అంజన్న పుణ్య క్షేత్రం కొండగట్టులో భక్తుల రద్దీ కారణంగా అన్నదానం టోకెన్ల కోసం కొట్లాట జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు మంగళవారం భారీగా తరలివెళ్లారు. మంగళవారం పైగా శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున గుట్టకు చేరుకొని అంజన్నకు మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సూపరిండెంట్లు సునీల్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. నిత్యం అన్నదానం చేసే సత్రం దగ్గర టోకెన్ల కోసం భక్తులు ఎక్కువ మంది రావడంతో స్వల్ప తోపులాట జరిగింది.

మంగళవారం కేవలం 200 మంది భక్తులకు అన్నదానం అవకాశం కల్పించడంతో సుమారు 300 పైగా భక్తులు చేరుకున్నారు. దీంతో టోకెన్ల జారీ చేసే దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. అన్నదానం టోకెన్ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా భక్తులు డిమాండ్ చేశారు.  నిత్యం భక్తులతో కిటకిటకిటలాడే కొండగట్టు అంజన్న ఆలయం ఆషాడ మాసంలో భక్తులు లేక వెలవెల పోయింది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో అంజన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.