ఆమ్‌స్టెల్విన్ (నెదర్లాండ్స్): ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. శనివారం జరిగిన పూల్–డి తొలి మ్యాచ్‌లో ఇండియా 3–1తో వేల్స్‌ను ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (11, 43వ ని) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచాడు. సంజయ్ (8వ ని) మరో గోల్ అందించాడు. సామ్ వెల్ష్ (56వ ని) వేల్స్ తరఫున ఏకైక గోల్ చేశాడు. 1975 స్వర్ణం తర్వాత తొలి వరల్డ్ కప్ మెడల్ కోసం ఎదురుచూస్తున్న ఇండియా ఆటను నెమ్మదిగా మొదలుపెట్టింది. దాంతో బంతిపై వేల్స్ ఆధిపత్యం చూపెట్టింది. రెండో నిమిషంలోనే ఇండియా రక్షణ శ్రేణిలోకి ప్రవేశించి ఫ్రెడ్ న్యూబోల్డ్ ఇచ్చిన పాస్‌ను జాక్ ప్రిచర్డ్ షాట్ కొట్టగా దాన్ని గోల్ కీపర్ సూరజ్ కర్కెరా సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ వెంటనే రీ బౌండ్‌లో న్యూబోల్డ్ చేసిన మరో ప్రయత్నంలో బాల్ బార్ పైనుంచి వెళ్లిపోయింది. ఐదో నిమిషంలోనూ ఇలాగే జరిగింది.
అప్పటివరకు నెమ్మదిగా ఆడిన ఇండియా ఒక్కసారిగా దూకుడును మొదలుపెట్టింది. ఏడో నిమిషంలో హార్దిక్ తొలి పెనాల్టీని సాధించాడు. కానీ హర్మన్ గ్రౌండ్ బయట ఉండటంతో సంజయ్ దాన్ని గోల్‌గా మలచలేకపోయాడు. తర్వాత లభించిన పెనాల్టీని సంజయ్ గోల్ కొట్టి ఇండియాను 1–0 ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత వచ్చిన మరో చాన్స్‌ను హర్మన్‌ప్రీత్ వృథా చేశాడు. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని హర్మన్ గోల్‌గా మలిచాడు. 19వ నిమిషంలో ప్రిచర్డ్ లాంగ్ పాస్‌తో కొట్టిన బాల్ బయటకు వెళ్లింది. ఇండియా 2–0తో తొలి హాఫ్‌ను ముగించింది. రెండో క్వార్టర్స్‌లో లభించిన పెనాల్టీని హర్మన్, మన్‌ప్రీత్ గోల్ కొట్టడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత నిరంతర ఒత్తిడితో 42వ నిమిషంలో మరో పెనాల్టీని సాధించారు. దీన్ని హర్మన్ శక్తివంతమైన లో ఫ్లిక్‌తో సద్వినియోగం చేసుకున్నాడు. స్కోరు 3–0కు పెరిగింది. 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వేల్స్ వృథా చేసిన మరో రెండు నిమిషాల్లోనే గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3–1కి తగ్గించింది.
