పీఎస్‌లో వ్యక్తి మృతిపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పీఎస్‌లో వ్యక్తి మృతిపై కౌంటర్‌ దాఖలు చేయండి..  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పోలీసుల కస్టడీలో ఓ వ్యక్తి మృతిచెందడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. భవిష్యత్‌లో ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. గచ్చిబౌలి పీఎస్‌లో ఈ నెల 17న నితీశ్ కుమార్‌ అనే వ్యక్తి మరణించిన ఘటనపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ కంపెనీల్లో బీహార్‌కు చెందిన నితీశ్ కుమార్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఇటీవల అక్కడున్న భద్రతా సిబ్బందికి, కార్మికులకు ఘర్షణ జరిగింది. 

దీంతో నితీశ్ కుమార్ తో పాటు మరికొందరిని గచ్చిబౌలి పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ నితీశ్ కుమార్‌ కుప్పకూలిపోగా.. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. పోలీసుల కస్టడీలోనే నితీశ్ చనిపోయాడని పేర్కొంటూ లాయర్‌ ఆర్‌. భాస్కర్‌ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటో పిల్‌గా హైకోర్టు  పరిగణనలోకి తీసుకుంది. 

గురువారం యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్, మాదాపూర్‌ డిప్యూటీ కమిషనర్, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వోలను ఆదేశించింది. విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.