గురుకులాల్లో మిగిలిన..పోస్టులను భర్తీ చేయండి

గురుకులాల్లో మిగిలిన..పోస్టులను భర్తీ చేయండి
  •  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : సుప్రీంకోర్టు ఆదేశానుసారం  గురుకులాల్లో మిగిలిన ఉద్యోగాలన్నింటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గురుకులాల్లో  మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ, తూము విజయ మనోహర్ తో సహా  21 మంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన జస్టిస్ పుల్ల కార్తీక్ బెంచ్ విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది హిమోగ్ని,  రఘు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఎన్ రమేశ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. 

“ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో  సుమారు 9210 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకాలు చేసే ప్రక్రియలో రిక్రూట్మెంట్ బోర్డు అవరోహణ క్రమంలో చేయవలసి ఉండేది. కానీ, ఆరోహణ పద్ధతిలో  ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా, ఒక అభ్యర్థి మూడు లేదా నాలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. అందువల్ల 2000 ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.

 ఈ సమస్యను  నిరుద్యోగులు  ప్రభుత్వానికి విన్నవించారు, నాన్ జాయినింగ్ ఉద్యోగాలను తదుపరి మెరిట్  లో ఉన్న అభ్యర్థులతో  భర్తీ చేయాలని విన్నవించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 2017లో విద్యుత్ సంస్థలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ల నియామక  ప్రక్రియలో, 2022లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో వందలాది పోస్టులు  మిగిలిన సందర్భంగా సుప్రీంకోర్టు ఉద్యోగి ఎంపికైన తర్వాత జాయిన్ కాని కారణంగా  మిగిలిన పోస్టుల్లో తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని  ఆదేశించింది. ఆ క్రమంలో మిగిలిన పోస్టులను భర్తీ చేశారు ”  అని పిటిషన్​లో పేర్కొన్నారు.