డాక్టర్ల పోస్టులు భర్తీ చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

డాక్టర్ల పోస్టులు భర్తీ చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • విచారణ 4 వారాలకు వాయిదా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ప్రతిష్టాత్మక కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న చిన్నపిల్లల డాక్టర్‌‌‌‌  పోస్టులను నెలలోగా భర్తీ చేయాలని, అలాగే, ఖాళీగా ఉన్న సివిల్‌‌‌‌  సర్జన్, ఇతర పోస్టులను కూడా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రి కొత్త భవనంలో ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు, తాగేందుకు నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  అలోక్‌‌‌‌  అరాధే, జస్టిస్‌‌‌‌  జె.అనిల్‌‌‌‌  కుమార్​ల డివిజన్‌‌‌‌  బెంచ్‌‌‌‌  ఆదేశాలిచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో 2016లో పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌‌‌‌గా తీసుకుని సోమవారం విచారణ జరిపింది. 

కొత్త భవనంలో కూర్చునేందుకు కుర్చీలు లేవని, మంచాలు ఎత్తుగా ఉండడంతో బాలింతలకు సమస్యగా ఉందని, ఆపరేషన్‌‌‌‌  చేయించుకున్న వాళ్లు కష్టాలు పడుతున్నారని నాడు పత్రికల్లో కథనం వెలువడింది. డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కథనం పేర్కొంది. ప్రభుత్వ లాయర్​ వాదిస్తూ.. ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. లిఫ్ట్‌‌‌‌ పనిచేస్తోందని, తాగునీరు సమకూర్చామని, శని, ఆదివారాల్లో ఆపరేషన్‌‌‌‌ థియేటర్ల దగ్గరి నుంచి మొత్తం ఆసుపత్రిని శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 244 పోస్టులకు 144 భర్తీ చేశామని, మరో 100 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు రిపోర్టు కూడా కోర్టుకు ఇచ్చామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.