డిస్నీలో ఉద్యోగుల తొలగింపు టార్గెట్ 7 వేల మంది : ఖర్చులు తగ్గించుకుంటున్నారంట..!

డిస్నీలో ఉద్యోగుల తొలగింపు టార్గెట్ 7 వేల మంది : ఖర్చులు తగ్గించుకుంటున్నారంట..!

Disney Layoffs: ప్రపంచ వ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు ప్రస్తుతం తమ సంస్థల్లో వరుస లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అయితే ఇవి పదుల సంఖ్యలో కాకుండా ఏకంగా వేల సంఖ్యలో ఉండటం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో మందగించిన వ్యాపారం, పెరిగిన నష్టాల నుంచి ఉపశమనం కోసం చాలా సంస్థలు ఖర్చులను తగ్గించటంపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిర్థాక్షణ్యంగా తొలగింపులకు పాల్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ వేల మంది ఉద్యోగులను తొలగించాలని టార్గెట్ గా పెట్టుకుందని తేలింది. ప్రస్తుతం కంపెనీ తన ఫిల్మ్, టెలివిజన్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని సమాచారం. దీని కారణంగా కంపెనీలోని మార్కెటింగ్, పబ్లిసిటీ, క్యాస్టింగ్, డెవలప్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఇండస్ట్రీలో వస్తున్న వేగవంతమైన మార్పులు తొలగింపులకు కారణంగా యాజమాన్యం చెబుతోంది. 

కంపెనీ సీఈవోగా బాబ్ ఇగర్ 2022లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ఉద్యోగుల తొలగింపులను ఆయన కొనసాగిస్తున్నారు. 2023లో ప్రారంభంలో 7వేల మందిని తొలగించటం ద్వారా బిలియన్ డాలర్ల డబ్బును ఆదా చేయాలని ఆయన నిర్ణయించారు. దీనిలో భాగంగానే పలుమార్లు ఇప్పటికే తొలగింపులు జరిగాయి. 2025 మార్చిలో కంపెనీ కంపెనీ 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఏబీసీ న్యూస్, డిస్నీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ఉద్యోగులు లైఆఫ్ అయ్యారు. ఈ క్రమంలో నేషనల్ జీయోగ్రఫీ చానల్, పిక్సర్, ఫ్రీఫామ్ ఉద్యోగులు కూడా ప్రభావితం అయ్యారు. 

2025 రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాదికి 7 శాతం పెరిగి దాదాపు రూ.లక్ష 90వేల కోట్లుగా నమోదైంది. కంపెనీ స్ట్రీమింగ్ వ్యాపార ఆదాయం కూడా భారీగానే పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. గడిచిన 10 నెలల్లో చూసుకుంటే, ఉద్యోగాల్లో కోత పెట్టడం డిస్నీలో ఇది వరుసగా నాలుగో సారి కావటం గమనార్హం.