సినిమా టికెట్ ధర పెంచాలని.. ఏ చట్టం చెబుతోంది?

సినిమా టికెట్ ధర పెంచాలని..  ఏ చట్టం చెబుతోంది?

చలనచిత్ర రంగం కేవలం వినోద వేదిక మాత్రమే కాదు.. అది రాజ్యాంగబద్ధమైన  పౌర హక్కులు, వ్యాపార స్వేచ్ఛ,  ప్రభుత్వ నియంత్రణ అధికారాలు కలిసే ఒక సంక్లిష్టమైన  చట్టపరమైన కూడలి.  భారతీయ సమాజంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  సినిమాకు ఉన్న ప్రాధాన్యతను  మనం విస్మరించలేం. ఇటీవల చోటు చేసుకుంటున్న టికెట్ ధరల విపరీత పెంపు మార్కెట్ శక్తుల నియంత్రణ లేని ధోరణిని, ప్రభుత్వ పర్యవేక్షక పాత్రలోని వైఫల్యాన్ని చట్టబద్ధంగా ప్రశ్నిస్తోంది. 


ఈ    ఏకపక్ష   ధరల పెంపు  కేవలం సామాన్యు   డిపై ఆర్థికభారం మోపడమే కాకుండా, రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాన్ని యధేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగబద్ధమైన వ్యాపార స్వేచ్ఛకు,  సామాజిక న్యాయానికి  మధ్య ఉండాల్సిన  సమతుల్యతను ఇక్కడ  
ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

సినిమాటోగ్రాఫ్ చట్టం

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ వినోదం, వినోదపు పన్ను వంటి అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చింది. 1952 నాటి కేంద్ర సినిమాటోగ్రాఫ్  చట్టం ప్రధానంగా చలనచిత్రాల సెన్సార్‌షిప్, ప్రదర్శన అనుమతుల గురించి  వివరిస్తుంది.  అయితే  ప్రదర్శన వేళలు, టికెట్ ధరల నియంత్రణ బాధ్యతను ఆయా రాష్ట్రాల సినిమాటోగ్రాఫ్ నిబంధనలే నిర్ణయిస్తాయి. ఈ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ ధరలను నియంత్రించే విచక్షణ అధికారాన్ని  కట్టబెట్టాయి. థియేటర్ల యాజమాన్యం తమకు నచ్చినట్లు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛను ఈ చట్టాలు పూర్తిగా నిరోధిస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాల ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవడమే ఈ చట్టాల అంతిమ ఉద్దేశమని మనం గుర్తించాలి. ధరలను నిర్ణయించే అధికారం కేవలం కార్యనిర్వాహక వ్యవస్థకే ఉందని దేశంలోని  అత్యున్నత న్యాయస్థానాలు పలుమార్లు స్పష్టం చేశాయి.

భారీ బడ్జెట్ చిత్రాల వాదన, చట్టపరమైన లోపాలు

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ ‘భారీ బడ్జెట్ చిత్రాలు’ అనే కొత్త వర్గీకరణను తెరపైకి తెచ్చింది. వందల కోట్ల పెట్టుబడితో నిర్మించిన చిత్రాలు  తమ  పెట్టుబడిని త్వరగా రాబట్టుకోవడానికి టికెట్ ధరల పెంపును ఒక సాధనంగా వాడుకుంటున్నాయి.  నిర్మాతలు, పంపిణీదారులు  మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ ఖర్చులు  పెరిగాయని వాదనలు వినిపిస్తున్నారు.  

నిర్మాత తన వ్యాపార నిర్ణయంతో చేసే అధిక పెట్టుబడి వల్ల కలిగే నష్టభయాన్ని  ప్రేక్షకులపై రుద్దడం కేవలం వ్యాపార సూత్రాలకే కాదు, ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. ఎంత బడ్జెట్ పెట్టాలనేది  నిర్మాత ఐచ్ఛిక నిర్ణయం అయినప్పుడు ఆ నిర్ణయం వల్ల కలిగే ఆర్థిక నష్టభయాన్ని వినియోగదారుడిపైకి నెట్టడం వ్యాపార నైతికతకే కాదు, చట్టబద్ధమైన పరిమితులకు కూడా విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) ప్రతి పౌరుడికి వ్యాపారం చేసుకునే హక్కును ఇస్తుంది, కానీ అదే సమయంలో ప్రభుత్వం సహేతుకమైన నియంత్రణలను విధించవచ్చు.  

వినియోగదారుల హక్కుల ఉల్లంఘన

వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ఏ సేవకైనా ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే ఉండాలి. సినిమా టికెట్ ఒక సేవ కిందకు వస్తుంది కాబట్టి దాని ధరలు పారదర్శకంగా ఉండాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు విధిస్తున్న అదనపు ఛార్జీలు,  ఇంటర్నెట్  హ్యాండ్లింగ్ ఫీజులు వినియోగదారులపై పరోక్ష దోపిడీని ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేని అదనపు వసూళ్లు వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలో అక్రమ వర్తక పద్ధతి  కిందకు వస్తాయి; వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉంది. 

ఇవి వినియోగదారుల హక్కులను కాలరాయడమే కాకుండా, పన్నుల వ్యవస్థను కూడా పక్కదోవ పట్టిస్తున్నాయి.  వినోదం అనేది మనిషి మానసిక వికాసానికి కనీస అవసరమని, దానిని కేవలం ధనికులకే పరిమితం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రంగమైనా ప్రజా సంక్షేమం కంటే పైన ఉండదు. ఆర్టికల్ 38 ప్రకారం సామాజిక,   ఆర్థిక న్యాయం అందించడం రాజ్య వ్యవస్థ కర్తవ్యం. రాజ్యాంగబద్ధమైన నైతికత ప్రతి పౌరుడికి  సమానమైన వినోద అవకాశాలను కల్పించాలి. ప్రభుత్వాలు కేవలం చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా కాకుండా ప్రజా ప్రయోజనాల రక్షకులుగా వ్యవహరించాలి. 

- డా.కట్కూరి, సైబర్ సెక్యురిటీ,   న్యాయ నిపుణుడు