ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో త్వరలోనే ఫైనల్ చార్జిషీట్‌‌

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో త్వరలోనే ఫైనల్ చార్జిషీట్‌‌
  • ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌, సీడీఆర్, టెలికాం లిస్ట్‌‌ ఆధారంగా వేయనున్న సిట్‌‌
  • ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరికొంత మందిపై అభియోగాలు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌సహా 450 మందికిపైగా సాక్షులు
  • 2,500కు పైగా ఫోన్‌‌ ట్యాపింగ్ ఆధారాలు, ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ రిపోర్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌(సిట్‌‌) దర్యాప్తు తుది దశకు చేరుకున్నది.  ప్రధాన నిందితుడైన ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌‌‌రావుతోపాటు మాజీ సీఎం కేసీఆర్‌‌, కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌రావు, సంతోష్‌‌రావు, బీఆర్‌‌‌‌ఎస్ కీలక నేతలు, సాక్షులు, బాధితుల విచారణ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే ఫైనల్ చార్జిషీట్‌‌ దాఖలు చేసేందుకు సిట్‌‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. టెలికాం సర్వీసెస్​అందించిన 618 ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా దాదాపు 450 మందికి పైగా స్టేట్‌‌మెంట్లు రికార్డ్‌‌ చేసింది.

కేసులో బలమైన సాక్ష్యాలుగా 2,500 కు పైగా ఫోన్ ట్యాపింగ్‌‌ ఆధారాలు, ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ రిపోర్టులతో కూడిన అభియోగ పత్రం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌,  పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్ సహా కీలక నేతల స్టేట్‌‌మెంట్లను రికార్డ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌చార్జి శ్రీరాంరెడ్డి స్టేట్‌‌మెంట్‌‌ను ఈ నెల 25న రికార్డ్‌‌ చేసింది. పలువురు ముఖ్య నేతల స్టేట్‌‌మెంట్లను రికార్డ్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

 ఐదున్నర నెలలుగా దర్యాప్తు, కీలక ఆధారాలు..

కేసులో సమగ్ర దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో డిసెంబర్ 18న సిట్‌‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. నాటి నుంచి  ఐదున్నర నెలలుగా కీలక ఆధారాలు సేకరించారు. సాక్షులను పలుమార్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్‌‌లోని హార్డ్‌‌ డిస్క్‌‌లను రిట్రీవ్‌‌ చేసేందుకు యత్నించారు.  నిందితులకు బెయిల్ రావడంతోపాటు ప్రిలిమినరీ చార్జిషీట్‌‌ దాఖలు చేసి సరిగ్గా రెండేండ్లు కావస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరలో ఫైనల్‌‌ చార్జిషీట్‌‌ దాఖలు చేసేందుకు సిట్‌‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలు, నిందితులు, సాక్షులు, బాధితుల స్టేట్‌‌మెంట్లుసహా ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.  చార్జిషీట్‌‌ దాఖలు చేసిన తర్వాత ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా  సిట్‌‌ బృందం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. కాగా, తుది చార్జిషీట్‌‌లో ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుసహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు,శ్రవణ్‌‌రావుతోపాటు మరికొంత మందిపై అభియోగాలు మోపనున్నట్టు తెలిసింది.