సామాన్యుల సమస్యలే కంటెంట్‌‌..! కోట్లలో వ్యూస్‌‌...

సామాన్యుల సమస్యలే కంటెంట్‌‌..! కోట్లలో వ్యూస్‌‌...

ఇద్దరికీ సినిమా, యాక్టింగ్‌‌ అంటే ప్రాణం. ఆ ఇష్టమే వాళ్లను ప్రాణ స్నేహితులను చేసింది. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, కొన్నేళ్లలోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. వాళ్లే ‘పరితబంగల్’ ఫేమ్స్‌‌ గోపి, సుధాకర్. కేవలం ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేయడమే కాకుండా, సమాజంలోని లొసుగులను, సామాన్యుల సమస్యలను తమదైన శైలిలో చూపిస్తూ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నారు. 

గోపి అరవింద్ రాజా, సుధాకర్ జయరామన్ ఇద్దరూ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినవాళ్లే. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ సినిమా రంగం, యాక్టింగ్‌‌పై ఆసక్తి ఉండేది. అందుకే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. మొదట్లో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ‘మద్రాస్ సెంట్రల్’లో యాక్టర్స్‌‌గా కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ వాళ్లు పొలిటికల్ సెటైర్లు, సామాజిక అంశాల మీద చేసిన వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ.. వేరొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు పూర్తి క్రియేటివ్‌‌ ఫ్రీడం ఉండదు. అందుకే సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పంతో ఆ చానెల్ నుంచి బయటకు వచ్చారు. వెంటనే 2018 ఫిబ్రవరిలో సొంతంగా ‘పరితబంగల్’ పేరుతో చానెల్‌‌ పెట్టారు. 

ఎన్నో కష్టాలను ఎదుర్కొని..

సమాజంలో నిత్యం సామాన్య ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, విచిత్రమైన పరిస్థితులకు కామెడీని జోడించి ప్రజలకు చూపించాలనే లక్ష్యంతో వీడియోలు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో వాళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గోపి, సుధాకర్ చానెల్ ప్రారంభించిన కొత్తలో కెమెరాలు, లైటింగ్, మైకులు లాంటి ఎక్విప్‌‌మెంట్‌‌ కొనడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులుపడ్డారు. ‌‌‌‌అప్పటికే మార్కెట్‌‌లో ఉన్న పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్ల మధ్య తాము నిలదొక్కుకోగలమా? లేదా? అనే భయం ఉండేది.

యూట్యూబ్‌‌లో సక్సెస్‌‌ అవుతుండగానే క్రౌడ్ ఫండింగ్ (ప్రజల నుంచి సేకరించిన డబ్బు)తో సినిమా తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 24 గంటల్లోనే దాదాపు 50 లక్షల రూపాయలు క్రౌడ్‌‌ ఫండింగ్‌‌ చేసి రికార్డు సృష్టించారు. కానీ, కరోనా  లాక్‌‌డౌన్ వల్ల అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దాంతో వాళ్లపై సోషల్‌‌ మీడియాలో విమర్శలు, ఆర్థిక ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకుని  తాము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఎంతో టైం పట్టింది.  

ఈ మధ్య వాళ్లు చేసిన ‘సొసైటీ పావంగల్’ అనే సామాజిక వ్యంగ్య వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. ఒక వర్గాన్ని కించపరిచారనే ఆరోపణలు వచ్చాయి. అయినా, ఎంతోమంది నెటిజన్లు, సినీ ప్రముఖులు వాళ్లకు అండగా నిలబడ్డారు.

డిజిటల్ సామ్రాజ్యం

ఎన్ని సవాళ్లు ఎదురైనా, తమ కంటెంట్‌‌ను నమ్ముకుని ఇద్దరూ కలిసి బలమైన ఫ్యాన్‌‌బేస్‌‌ను నిర్మించుకోగలిగారు. భార్యా–భర్తల గొడవలు, ఆఫీస్ కష్టాలు, ఐటీ ఉద్యోగుల బాధలు, పొలిటికల్ లీడర్ల డ్రామాలు లాంటి ఎన్నో కాన్సెప్ట్‌‌లను ‘పావంగల్’ పేరుతో సిరీస్‌‌లుగా తీసుకొచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఒకే వీడియోలో గోపి, సుధాకర్ ఇద్దరే పదుల సంఖ్యలో విభిన్న పాత్రలు, గెటప్‌‌లు వేస్తూ అద్భుతమైన టైమింగ్‌‌తో వ్యూయర్స్‌‌ని ఆకట్టుకుంటున్నారు.

వీళ్లు వేసే వ్యంగ్యాస్త్రాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాదు.. ఎన్నో అడ్డంకులను దాటుకుని గోపి, సుధాకర్ వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లు లీడ్‌‌ రోల్స్‌‌లో నటించిన ‘ఓ గాడ్ బ్యూటిఫుల్’ అనే సినిమా ప్రస్తుతం పోస్ట్‌‌ ప్రొడక్షన్‌‌ పనుల్లో ఉంది. 

కోట్లలో వ్యూస్‌‌

ప్రస్తుతం చానల్‌‌ను 6.67 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ప్రతి వీడియోకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌‌తోపాటు ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కూడా ఫాలోయింగ్‌‌ సంపాదించుకున్నారు. యూట్యూబ్ యాడ్స్‌‌తో పాటు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా నెలకు సుమారు రూ. 10 లక్షల వరకు ఆదాయం వస్తోందని అంచనా.