నైట్ టైం లేట్ గా పడుకునే అలవాటు ఉందా..? అయితే.. మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే...!

నైట్ టైం లేట్ గా పడుకునే అలవాటు ఉందా..? అయితే.. మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే...!

సర్వేష్ అనే 42 ఏళ్ల ఐటీ ఉద్యోగి రాత్రివేళల వరకు పని చేయడం, సినిమాలు చూడడం వల్ల తరచూ ఒకటి, రెండు గంటలకు నిద్రపోయేవాడు. ఒకరోజు ఉదయం లేచిన తర్వాత చేయి తిమ్మిర్లు, మాటల్లో తడబాటు కనిపించాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు అది “ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA)”, అంటే “మినీ స్ట్రోక్” అని గుర్తించారు. నిద్ర అలవాట్లు మార్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు ఆయన సమయానికి నిద్రపోతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం వైద్యులు తరచూ చూస్తున్నట్లు చెప్తున్నారు. 

అర్ధరాత్రి దాటకముందు నిద్రపోతేనే నిజమైన గుడ్‌‌నైట్. కానీ ఈ రోజుల్లో చాలామంది రాత్రివేళల వరకు సినిమాలు, ఓటీటీ వెబ్‌‌సిరీస్‌‌లు చూస్తూ మొబైల్ స్క్రోలింగ్‌‌ చేస్తూ మేల్కొని ఉండటం నార్మల్ అయిపోయింది. ఇదే నేటి లైఫ్​ స్టయిల్​గా మారిపోయింది. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని వయసులవారూ దీని ప్రభావానికి లోనవుతున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. 

కానీ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఈ సమయం తగ్గిపోతుంది. దీంతో రక్తపోటు పెరగడం, శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అధికమవడం, రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం జరుగుతుంది. నిద్రలేమి కేవలం అలసటతోనే ఆగిపోదని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. శరీరంలోని సహజ జీవగడియారం (బయోలాజికల్ క్లాక్) దెబ్బతినడం నుంచి మెదడు, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడేవరకు అనేక సమస్యలకు ఇది కారణమవుతుందని చెప్తున్నారు. 

తక్కువ నిద్ర వల్ల మెదడుకు రక్తప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అలాగే రక్తం గడ్డకట్టే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మెదడులోని చిన్న రక్తనాళాలు దెబ్బతిని, పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇదే కొన్నిసార్లు మినీ స్ట్రోక్‌‌కు దారి తీస్తుంది. ఇది భవిష్యత్తులో వచ్చే పూర్తి స్ట్రోక్‌‌కు ముందస్తు హెచ్చరికగా కూడా భావిస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు ఇప్పటికే ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. 2023లో ప్రచురితమైన కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా కనిపించింది. 

అలాగే అత్యధికంగా, అంటే తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. రాత్రివేళల్లో తరచూ మేల్కొనడం, నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయని స్టడీలు సూచిస్తున్నాయి. అంతేకాదు మరో పరిశోధనలో రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో స్ట్రోక్‌‌కు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు తెలిసింది.

మినీ స్ట్రోక్ లక్షణాలు

మినీ స్ట్రోక్ లేదా ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (టిఐఎ) అనేది మెదడుకు రక్తప్రవాహం కొద్దిసేపు అంతరాయం కలగడం వల్ల వస్తుంది. దీని లక్షణాలు కొన్ని నిమిషాలు లేదా గంటల పాటు ఉండి తగ్గిపోవచ్చు. కానీ ఇది పూర్తి స్ట్రోక్‌‌కు ముందస్తు హెచ్చరిక కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందిలో ఈ లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోతాయి. అయినప్పటికీ వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని న్యూరాలజీ ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. ఇందులో 

ఆకస్మికంగా కనిపించే ప్రధాన లక్షణాలు ఇవి:

  •     ముఖం ఒకవైపు వంగిపోవడం లేదా తిమ్మిర్లు రావడం
  •     చేయి లేదా కాలు బలహీనపడటం
  •     రెండు చేతులు పైకి ఎత్తినప్పుడు ఒక చేయి కిందకు జారిపోవడం
  •     మాటలు తడబడటం లేదా ఇతరులు చెప్పేది అర్థం కాకపోవడం
  •     ఒక కంటిలో లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం, డబుల్ విజన్ రావడం
  •     ఆకస్మిక మైకం లేదా బ్యాలెన్స్ కోల్పోవడం
  •     కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి రావడం
  •     గందరగోళంగా అనిపించడం లేదా ఆలోచనల్లో స్పష్టత తగ్గడం

ఏం చేయాలి?

  •    ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి.
  •     రోజుకు కనీసం ఏడు గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి.
  •     పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం తగ్గించాలి.
  •     సాయంత్రం తర్వాత కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్​ను తగ్గించడం మంచిది.
  •     నిద్రకు వెళ్లే గంట ముందు మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌‌లకు దూరంగా ఉండాలి.
  •     ప్రతిరోజూ కొంతసేపు నడక లేదా వ్యాయామం చేయాలి.
  •     నిద్రించే గదిని ప్రశాంతంగా, చల్లగా, చీకటిగా ఉంచాలి.
  •     ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా ఉపయోగపడతాయి.
  •     నిద్ర సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.

BE FAST గుర్తుంచుకోండి!

B-Balance  

మైకం, బ్యాలెన్స్ కోల్పోవడం

E - Eyes 

చూపు సమస్యలు

F - Face 

ముఖం ఒకవైపు వంగిపోవడం

A - Arms 
చేతి బలహీనత

S - Speech 

మాటల తడబాటు

T - Time 
వెంటనే మెడికల్ సాయం తీసుకోవడం