గ్రేటర్ వరంగల్ లో చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రశాంతం..ముగిసిన కార్పొరేటర్ల పదవీకాలం

గ్రేటర్ వరంగల్ లో చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రశాంతం..ముగిసిన కార్పొరేటర్ల పదవీకాలం
  • ముగిసిన కార్పొరేటర్ల పదవీకాలం
  • ఆఖరి సర్వసభ్య సమావేశంలో  రూ.76.56 కోట్ల పనులకు ఆమోదం
  • ఐదేండ్లలో రూ.3,331 కోట్లతో వరంగల్ డెవలప్మెంట్ : మేయర్ గుండు సుధారాణి

హనుమకొండ/ వరంగల్ సిటీ, వెలుగు:  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఖరి సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. 2021 మే 7న జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం కొలువుదీరగా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆఖరి కౌన్సిల్ మీటింగ్ ను బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్ కౌన్సిల్ హాల్​లో నిర్వహించారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కౌన్సిల్ మీటింగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రూ.76.56 కోట్లతో అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్ లో కార్పొరేటర్లు గత ఐదేండ్ల సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, తమ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు కౌన్సిల్ హాలు ఎదుట మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయం కోసం రూ.29 లక్షలతో నిర్మించనున్న స్టాల్స్, బల్దియా జనరల్ ఫండ్ రూ.95 లక్షలతో ఇండోర్ స్టేడియం సమీపంలో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులకు పాలకవర్గం ఆధ్వర్యంలో చివరి శిలాఫలకాన్ని ప్రారంభించారు. కాగా, గ్రేటర్ అధికారుల తీరుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఫైర్ అవడం చర్చనీయాంశంగా మారింది. 

3,331 కోట్లు..  6,676 పనులు 

గడిచిన ఐదేండ్లలో రూ.3,331 కోట్లతో 6,676 పనులు చేపట్టి వరంగల్ మహానగర అభివృద్ధికి కృషి చేసినట్లు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. అందులో సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతావి వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల అయిన అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు పునాది వేయడం కీలక విజయమని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నగరానికి భారీగా నిధులు మంజూరయ్యాయన్నారు. పార్టీలకు అతీతంగా పాలకవర్గం సమష్టిగా అభివృద్ధి సాధించినట్లు చెప్పారు.

స్మార్ట్ సిటీ ద్వారా రూ.950 కోట్లతో స్మార్ట్ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ చేపట్టి, నగరానికి కొత్త రూపు తీసుకొచ్చామన్నారు. రూ.100 కోట్ల ఎస్పీవీ నిధులతో రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జులు, రూ.25 కోట్ల స్పెషల్ ఫండ్, రూ.550 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో వరద నివారణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని, నగరాన్ని దేశ స్థాయిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరంగల్ అభివృద్ధికి సహకరించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరికీ మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.

భారీ ప్రాజెక్టులతో సమగ్రాభివృద్ధి..

వరంగల్ నగరాభివృద్ధిలో భాగంగా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్ టైల్ పార్క్ తదితర కీలక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఎంపీ కడియం కావ్య అన్నారు. శానిటేషన్, తాగునీరు, పరిశుభ్రతపై జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని, ప్రజా సేవే నిజమైన లక్ష్యమన్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభమవుతున్న నేపథ్యంలో దోమల నివారణకు ఫాగింగ్, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మనుషులా.. గాడిదలా..

జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గ్రేటర్ ఆఫీసర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా హాలులో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తూ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయగా, తన నేమ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఎమ్మెల్సీ సారయ్య తీవ్ర అంసతృప్తికి గురయ్యారు. 'ఇక్కడ ఇన్​చార్జి ఎవరు.. మనుషులా.. గాడిదలా..? నెనెక్కడ కూర్చోవాలి' అంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ఆఫీసర్లంతా అవాక్కయ్యారు. ఇంతలోనే ఆయన నేమ్ బోర్డు ఏర్పాటు చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.