జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 3,98,982 ఓట్లు.. తుది ఓటరు జాబితా విడుదల

జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 3,98,982 ఓట్లు.. తుది ఓటరు జాబితా విడుదల
  • తుది ఓటరు జాబితా విడుదల
  • పురుషులు 2,07,367, స్త్రీలు 1.91,590
  • నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, బీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రిలీజ్​చేశారు. మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1.91,590 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారని ప్రకటించారు. నియోజకవర్గం ఓటర్లలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది కాగా, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదయ్యారు. 

నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్​లుండగా.. ఒక్కో పోలింగ్​స్టేషన్​లో యావరేజ్​గా 980 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి వారు ఈ స్థానం కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో తలమునకలయ్యారు.

బూత్ లెవెల్ ఏజెంట్​లను నియమించుకోవాలి

జూబ్లీహిల్స్‌‌‌‌ అసెంబ్లీ ఉపఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలనీ కర్ణన్‌‌‌‌ కోరారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్​ఆఫీసులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కర్ణన్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ఓటర్లు తమ పేరును లిస్ట్​లో వెరిఫై చేసుకునేందుకు ఈసీఐ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌, సీఈవో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌, ఈఆర్వో ఆఫీసు, ఓటర్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ యాప్‌‌‌‌ లో సంప్రదించవచ్చని కమిషనర్‌‌‌‌ తెలిపారు. రాజకీయ పార్టీలు, పౌరులు ఫారం-6, ఫారం-7, ఫారం-8 లో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం ఉందన్నారు.

 జులై 1, 2025 నాటికి 18 ఏండ్లు నిండిన వారు, అర్హులుగా ఉండి ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకొని  వారు ఫారం -6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్‌‌‌‌ లెవెల్‌‌‌‌ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. తుది జాబితా ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.