మీ నుంచి నేర్చుకునే గతి పట్టలే

మీ నుంచి నేర్చుకునే గతి పట్టలే

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. బడ్జెట్​పై ఆయ న చేసిన ‘సత్తాలేని డాక్టర్లు’ కామెంట్​కు అదే రీతిలో రిప్లై ఇచ్చారు. ఎఫ్​డీఐలు వెళ్లిపోయి, క్రోనీలు బ్యాం కులోన్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోవడానికి కారణమైన వారి ‘తప్పుడు నిర్ణయాల’ నుంచి తాను నేర్చుకోవాల్సిన​గతి పట్టలేదని అన్నారు. మంగళవారం పార్లమెంట్​లో బడ్జెట్​పై చర్చ సందర్భంగా ఆమె కాంగ్రెస్, చిదంబరంపై విరుచుకుపడ్డారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందని చెప్పడానికి ఏడు ముఖ్యమైన మాక్రో ఇండికేటర్లే సాక్ష్యం. ఎకానమీకి ఎలాంటి నష్టం లేదు. అందుకోసం ఎన్నెన్నో చర్యలు చేపట్టాం’’ అని లోక్​సభలో చర్చ సందర్భంగా ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభలో మాట్లాడారు. అక్కడే చిదంబరంపై మండిపడ్డారు. 2008–2009లో యూపీఏ చేసిన తప్పులను తాము రిపీట్​ చేయదలచుకోలేదన్నారు.

ముందే అప్పులిచ్చిన్రు.. ఎన్​పీఏలు పెంచిన్రు

ఎకానమీని పెంచాలన్న ఉద్దేశంతో నాటి యూపీఏ సర్కారు అప్పులను విపరీతంగా ఇచ్చేసిందని, కొన్ని లోన్లను అడ్వాన్స్​గానూ ఇవ్వడం వల్ల నాన్​ పర్ఫార్మింగ్​ అసెట్స్​ (నిరర్ధక ఆస్తులు– ఎన్​పీఏ)లు పెరిగిపోయాయని మండిపడ్డారు. అప్పుడు కాంగ్రెస్​ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ పరిస్థితి దాపురించిందన్నారు. కాబట్టి ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ ఆర్థిక వ్యవస్థపై భారం పడేలా చేసే అలాంటి తప్పుడు నిర్ణయాలను తీసుకోబోమన్నారు. అటల్​బిహారీ వాజ్​పేయీ ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల, 2004, 2014 టర్మ్​లలో కాంగ్రెస్​కు ‘అదృష్టం’ కలిసొచ్చిందన్నారు. సలహాలు, సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటామని, కానీ, పదే పదే అవాకులు, చవాకులు పేలితే మాత్రం ఊరుకోబోమని అన్నారు. యూపీఏ విధానాల వల్ల 2014లో బ్యాంకులు ట్విన్​ బ్యాలెన్స్​ షీట్​ (ఓవైపు బ్యాంకుల్లో ఎన్​పీఏలు పెరగడం, మరోవైపు కార్పొరేట్ల అప్పులు పేరుకుపోవడం) సంక్షోభంలో మునిగిపోయాయన్నారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని క్రోనీలు దేశం వదిలి పారిపోయారన్నారు. వాటికి కారణమైన కాంగ్రెస్​ తప్పుడు విధానాలను తాము రిపీట్​ చేయబోమన్నారు. మొదటి దఫా బడ్జెట్​ సమావేశాలు పూర్తయ్యాయి. మంగళవారం రెండు సభలు వాయిదా పడ్డాయి. మార్చి 2, ఏప్రిల్​ 3న బడ్జెట్​ ఆమోదం కోసం మళ్లీ సమావేశమవుతాయి.