కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్

కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్

గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రభావంతో దేశ ఆర్థికస్థితి కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అన్ని రంగాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‎ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో 2022–23 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‎ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‎లో ప్రవేశపెడుతున్నారు. కరోనా దృష్ట్యా ఈసారి పేపర్ లెస్ బడ్జెట్ ను అమలుచేస్తున్నారు.

  • కృష్ణా –గోదావరి నదుల అనుసంధానానికి ప్రణాళిక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు.  రెండు రాష్ట్రాల్లోని నదుల అనుసంధానంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. త్వరలో కృష్ణా –గోదావరి, కృష్ణ– పెన్నా నదుల అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.

  • ఐటీ రిటర్న్స్‌లో అప్‌డేట్‌కు రెండేళ్ల సమయం

కేంద్ర బడ్జెట్‌ వస్తుందంటే వేతన జీవులంతా ఎదురు చూసేది ఆదాయ పన్ను పరిమితిలో మార్పుల ప్రకటన కోసమే. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు పెద్ద ఊరట ఏమీ కనిపించలేదు. అయితే ఐటీ రిటర్న్​ల దాఖలులో నవీకరణ చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే ఐటీ రిటర్న్స్‌ దాఖలులో ఏవైనా పొరబాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకునేందుకు, కొత్తగా అప్‌డేట్ చేసేందుకు రెండేళ్ల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 

  • కోఆపరేటివ్ సొసైటీలకు పన్ను తగ్గింపు

కోఆపరేటివ్ సొసైటీలకు పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్‌ పన్ను ఉంటుందన్నారు. ఇకపై కోఆపరేటివ్ సొసైటీపై విధించే ఆల్టర్నేటివ్ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీలపై సర్‌‌చార్జీని కూడా ఏడు శాతానికి తగ్గిస్తున్నామన్నారు.

వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్స్‌ఫర్‌‌పై వచ్చే ఆదాయానికి ఇకపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. వీటిని ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తే.. ఆ తీసుకున్న వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై వచ్చే ఆదాయ నుంచి 15 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈక్విటీ ట్యాక్స్ సర్‌‌చార్జ్‌ను 15 శాతానికి తగ్గించారు.

  • ఏడాది 80 లక్షల సొంతిళ్లు

పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2022–23 సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 48 వేల కోట్లు కేటాయించామన్నారు. 

  • రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు పెద్ద ఊరట లభించింది. రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధిని ప్రకటించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. అలాగే ఆర్బీఐ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెడుతున్నామన్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీని రూపొందిస్తామని, కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీ రూపకల్పన జరుగుతుందన్నారు. 

సోలార్​ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు

దేశంలో విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ లో సోలార్​ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు కేటాయించారు. దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం కోసం 4 పైలట్‌ ప్రాజెక్టులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

డిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ

దేశంలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్‌చెయిన్, ఇతర్ టెక్నాలజీల సాయంతో ఈ డిజిటల్ రూపీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. దేశ ఎకానమీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

  • విద్యార్థుల కోసం వన్ క్లాస్ .. వన్ టీవీ చానెల్

కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పేద విద్యార్థుల కోసం ప్రధాని ఈ-విద్యా కార్యక్రమం కింద మరిన్ని టీవీ చానెళ్లు ప్రవేశపెడుతున్నట్లు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 12 చానెళ్లను 200కు పెంచుతున్నట్లు ప్రకటించారు.  ఈ విధానం ద్వారా అన్ని రాష్ట్రాలలోని 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో విద్యను అందించడానికి వీలు కలుగుతుందని చెప్పారు.

  • దేశంలో ఈ ఏడాది 5జీ టెక్నాలజీ షురూ

దేశంలో ఈ ఏడాది 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022–23లో ప్రైవటే సంస్థల ద్వారా 5జీ సాంకేతికతను దేశంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.  2022–23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను చేరవేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు.

2022–23లో ఈ పాస్‌పోర్టు సేవలను ప్రారంభించబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

  • 400 వందే భారత్ రైళ్లు

రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా రాబోయే మూడేళ్లలో 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్ ను కూడా అభివృద్ది చేస్తామని చెప్పారు. మెట్రో వ్యవస్థలను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేస్తామని చెప్పారు. రైతులు, MSMEల కోసం రైల్వే కొత్త ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. 

  • త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్‌ఐసీ (భారత బీమా సంస్థ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) గురించి ప్రస్తావించారు. త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌‌ ఇండియా, నీలాంచల్‌ నిస్పా‌ట్​ నిగమ్‌ లిమిటెడ్‌ను డిజిన్వెస్ట్‌మెంట్ పూర్తయినట్లు నిర్మలమ్మ చెప్పారు. తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎకానమీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 

  • కరోనా సంక్షోభంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం

ఆర్థిక వృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. కరోనా సంక్షోభంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుంన్నారు.  భారత్  ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు. పేద మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగంగా జరుగుతోందన్నారు. వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు నిర్మల. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విద్యుత్ వంట గ్యాస్ ప్రతీ ఇంటికి చేరేలా చేశామన్నారు. పేదలకు మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యమన్నారు.  ఆత్మ నిర్భర భారత్ తో రూ.16 లక్షల ఉద్యోగాలు కల్పించానమ్నారు.

నేషనల్ హైవేస్ నెట్ వర్క్ ను 25 వేల కి.మీకు పెంచుతామన్నారు.

  • నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్

కేంద్ర బడ్జెట్ 2022–23ని ఆధారంగా రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అన్న నాలుగు అంశాలే స్తంభాలుగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని ఆమె చెప్పారు.

  • రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. దేశ జీడీపీ గ్రోత్ రేటు 9.27 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎకానమీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాబోయే 25 ఏళ్ల (అమృత్ కాల్‌) ప్లాన్‌తో ఈ రిఫార్మ్స్‌ తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

 

  • బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బడ్జెట్ 2022కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతున్న సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతున్న మహిళా మంత్రి నిర్మలమ్మే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. దేశంలో మహిళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆమెతోనే సాధ్యమైంది. వరుసగా నాలుగో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో తానే ప్రధానిగా, తానే ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ మన నిర్మలమ్మే. ఇప్పడు ఆమె వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతూ ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకున్నారు.

గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రభావంతో దేశ ఆర్థికస్థితి కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అన్ని రంగాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‎ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో 2021–22 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‎ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‎లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా దృష్ట్యా ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ను అమలుచేయనున్నారు.

  • పార్లమెంట్లో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం

పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2022–23 వార్షిక బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేబినెట్ భేటీ కోసం పార్లమెంట్ కు చేరుకన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రివర్గ సమావేశానికి పార్లమెంటుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.

  •  పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్

కాసేపటి క్రితమే.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ సారి కూడా ఎర్రటి బ్యాగులో ఆమె బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు.  పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. 2022–23 వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడతారు.  వరుసగా నాలుగో ఏడాది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలమ్మే. 

  • పార్లమెంట్‌కు బడ్జెట్ పేపర్ల ట్రక్‌.. బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు

 కేంద్ర బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు.ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కాపీల బండిల్స్‌ను పార్లమెంట్‌ వద్దకు ఒక ట్రక్కులో చేర్చారు అధికారులు. ఈ ట్రక్కులోని బడ్జెట్ పేపర్లను కిందకు దించిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు.

  • రాష్ట్రపతిని కలిసిన ఆర్థికశాఖ బృందం 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‎ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మర్యాదపూర్యకంగా కలిశారు.

  • నార్త్ బ్లాక్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. అందుకోసం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్ తో ఆమె చేరుకున్నారు. అన్ని రంగ అవసరాలకు అనుగుణంగా సమ్మిళిత బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. రైతుల నుంచి అన్ని రంగాలు వారు బడ్జెట్ మీద అంచనాలను కలిగి ఉన్నారన్నారు. లోక్ సభలో ఉదయం 11 గంటలకు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. మధ్యాహ్నం 3 గంటలకు... బడ్జెట్ పై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక కార్యదర్శి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఇతర కార్యదర్శులు, ముఖ్య ఆర్థిక సలహాదారుతో పాటు బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు నేషనల్ మీడియా సెంటర్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.