
రెండు వేల నోట్ల మార్పిడికి గడువును పొడిగించే ప్రసక్తేలేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ప్రభుత్వం ఇతర నోట్లను రద్దు చేయాలనుకుంటుందా అని లోక్ సభలో ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, మరో 14 మంది ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అలాగే రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువును పొడిగించే ఆలోచన లేదని చెప్పారు.
రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2 వేల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువుకు ఇంకా మరో రెండు నెలల సమయం ఉంది.
ఆర్బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ. 2 వేల కరెన్సీ నోట్లలో దాదాపు 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి. మే 19న ఉపసంహరణ ప్రకటన తర్వాతి రోజున రూ.3.56 లక్షల కోట్లుగా ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం చలామణి జూన్ 30 నాటికి రూ.84 వేల కోట్లకు తగ్గింది.