- పెరుగుతున్న విద్య, వైద్యం, కాస్ట్ ఆఫ్ లివింగ్.. అదే స్థాయిలో పెరగని ఆదాయాలు
- సోషల్ మీడియాలో వైరలైన ఉదయన్ అద్యే పోస్టు
- నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలోని మెట్రో నగరాల్లో పిల్లల్ని పెంచడం భారంగా మారిపోయింది. ఇప్పటికే అనేక కారణాలు చూపుతూ 30 ఏండ్ల వరకు చాలా మంది యువత పెండ్లిళ్లు చేసుకోవడం లేదు. ఒకవేళ చేసుకున్నా బిడ్డను కంటే వారిని పెంచడానికి భవిష్యత్తులో రూ. కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, దీని కోసం ఆదాయం పెంచుకునేలా ముందే ప్లాన్ చేసుకోవాలని ప్రముఖ ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్ ఉదయన్ అద్యే సోషల్ మీడియాలో ఒక పోస్ట్పెట్టారు.
మెట్రోపాలిటిన్ సిటీల్లో లివింగ్ కాస్ట్, స్టడీ, హెల్త్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని మరో 20 ఏండ్లలో అవి మరింత పెరిగి రూ. కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని, దీని కోసం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే అప్పుల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.
21 ఏండ్లు పెంచాలంటే.. రూ. 6.75 కోట్లా?
దేశంలోని మెట్రో నగరాల్లో ఓ బిడ్డ పుట్టినప్పటి నుంచి 21 ఏండ్ల వరకు పెంచాలంటే రూ. 6.75 కోట్లు ఖర్చవుతాయని ఉదయన్ ఆద్యే అన్నారు. మెట్రో నగరాల్లో ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిస్తే అతడికి లేదా ఆమెకు 21 ఏండ్లు వచ్చే సరికి దాదాపు రూ. 6.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెరిగిన విద్య ఖర్చులు, వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, లివింగ్, రూమ్ రెంట్స్ ఇలా అనేక రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ అంకె ఏ మాత్రం అతిశయోక్తి కాదని చెప్పారు.
ఎందుకు అంత ఖర్చంటే..
దేశంలో విద్యా రంగం చాలా వేగంగా మార్పు చెందుతోంది. స్కూల్, కాలేజీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ లాంటి చదువులకు భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ప్రైవేటులో ఏడాదికి ఏ కోర్సు అయినా ప్రస్తుతం రూ. 3 లక్షల నుంచి కాలేజీని బట్టి రూ. 20 లక్షల వరకూ ఉంది. మరో 18 ఏండ్ల తర్వాత ఇది పదింతలు పెరిగి రూ. 1.6 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఉదయన్అంచనా వేశారు.
నగరాల్లోని ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఏటా10 నుంచి 12 శాతం వరకు పెరుగుతున్నాయి. అంటే ప్రతి ఆరేండ్లకు ఒకసారి రెట్టింపు అవుతున్నాయి. బిడ్డ పెంపకంలో కేవలం స్కూల్ ఫీజులు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు తక్కువ అంచనా వేసే ఇతర ఖర్చులు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
చిన్నతనంలో నానీ సర్వీసులు (స్నానం చేయించడం, ఇతర సేవలు), స్పోర్ట్స్, మ్యూజిక్ క్లాసులు, కోచింగ్ సెంటర్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, ట్రీట్మెంట్ఖర్చులు అన్నీ కలిపితే ఆ మొత్తం భారీగా పెరుగుతుందని వివరించారు. ఈ 21 ఏళ్ల ప్రయాణంలో ప్రతి చిన్న ఖర్చును పరిగణనలోకి తీసుకుంటేనే అసలు వాస్తవం బయటపడుతుందని స్పష్టం చేశారు.
సంప్రదాయ పొదుపు పథకాలు సరిపోవు
చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే సంప్రదాయ పెట్టుబడి పథకాలు భవిష్యత్తు అవసరాలను తీర్చలేవన్నారు. పెరుగుతున్న ఖర్చుల వేగానికి అనుగుణంగా ఈ పథకాలు రాబడిని ఇవ్వలేవని, అందుకే ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ అంచనా ప్రతి కుటుంబం జీవనశైలి ఎంచుకునే స్కూళ్లను బట్టి మారుతూ ఉంటుందని, మధ్యతరగతి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని కళ్లు తెరిపించే వాస్తవంగా కొనియాడుతుండగా, మరికొందరు ఇలాంటి అంచనాలు సంతానం పట్ల భయాన్ని, ఆందోళనను పెంచుతాయని విమర్శిస్తున్నారు. ‘పెండ్లి పెటాకులు లేకుండా సంపాదించే డబ్బుతో నేను లాంబర్గిని కొనుక్కుంటాను’ అంటూ ఒక వినియోగదారుడు హాస్యంగా స్పందించగా, ‘మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక ’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చర్చకు దారి తీసిన పోస్ట్
మెట్రో నగరాల్లో పేరెంటింగ్ అనేది ఇప్పుడు ఒక ఖరీదైన వ్యవహారంగా మారిందనే చర్చను ఈ పోస్ట్ రేకెత్తించింది. అయితే కొంతమంది మాత్రం ఉదయన్అంచనా తప్పని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న కుటుంబాలు కూడా ఉంటాయని నెలకు 50 వేల జీతం సంపాదించేవారు 20 ఏండ్లు పని చేసినా రూ. కోటి మిగుల్చుకోలేరని, అలాంటిది రూ. 6.72 కోట్లు ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నిస్తున్నారు. హై లైఫ్లీడ్చేసే ఉన్నత, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఉదయన్పోస్ట్వర్తిస్తుందంటున్నారు.
