మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఇక వేధింపులకు చెక్.. 10 మంది ఉద్యోగులుంటే కమిటీ ఏర్పాటు

మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఇక వేధింపులకు చెక్.. 10 మంది ఉద్యోగులుంటే  కమిటీ ఏర్పాటు
  • ‘పోష్’ ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదులు పరిష్కరించాలి : కలెక్టర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలుగా మార్చడానికి పోష్ చట్టం- 2013ను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలో లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం తప్పనిసరిగా అంతర్గత కమిటీ ఏర్పాటు చేయాలని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 

కమిటీలో సీనియర్ మహిళా ఉద్యోగి ప్రిసైడింగ్ ఆఫీసర్‌‌గా, సామాజిక లేదా న్యాయ పరిజ్ఞానం ఉన్న ఇద్దరు ఉద్యోగులతో పాటు మహిళా హక్కుల కోసం పనిచేసే ఎన్జీవో ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉండాలని, మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది మహిళలే ఉండాలన్నారు. ఒకే సంస్థకు వేర్వేరు ప్రాంతాల్లో బ్రాంచ్​లు ఉంటే ప్రతి చోటా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. 

నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖతో కూడిన హైదరాబాద్ స్థానిక కమిటీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి తనకు రిపోర్ట్​ ఇవ్వాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే యజమానులకు రూ. 50 వేల వరకు జరిమానా విధిస్తామని 
హెచ్చరించారు.