12 వేల మందిలో ఒక్కరికీ ఇయ్యలే!..లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు

12 వేల మందిలో ఒక్కరికీ ఇయ్యలే!..లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు
  •     మొదటి విడతగా 546 మందికి లక్ష సాయం ఇస్తామని ఇంకా ఇయ్యలే
  •      ఇప్పుడు రెండో విడతలో 600 మందికి ఇవ్వాలని ఆదేశాలు
  •     లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు

 సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి జిల్లాలో మైనార్టీల స్వయం ఉపాధి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం తప్ప ఆర్థిక సాయం మాత్రం ఇవ్వడం లేదు. మొదటి విడతలో ఎంపిక చేసినవారికి ఇవ్వకుండానే రెండో విడతకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. ఈ పరిస్థితితో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

వేల దరఖాస్తులు..

మైనార్టీలు స్వయం ఉపాధి ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం గత జనవరిలో ప్రకటన జారీ చేసింది. దీనికి ఎంపికైన లబ్ధిదారులు రూ.20 వేల బ్యాంకు రుణ సాయం పొందగలిగితే ప్రభుత్వం రూ.80 వేల సాయం అందిస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 12 వేల మంది మైనార్టీ నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,146 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.

మొదటి విడత  546 మందికి రూ.లక్ష సాయం అందించేందుకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ విభాగానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రక్రియ మొదలై 8 నెలలు గడిచినా వారికి ఆర్థిక సాయం అందించలేదు. దాంతో లబ్ధిదారులు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. 

మొదటిదే లేదు.. ఇక రెండోదట!

మైనార్టీల స్వయం ఉపాధికి మొదటి విడత నిధులు మంజూరు చేయని ప్రభుత్వం రెండో విడతలో జిల్లాలోని మరో 600 మందికి లక్ష రూపాయల సాయం ఇవ్వాలంటోంది. మొదటి విడతకు సంబంధించిన ఫండ్స్ ఇటీవలే విడుదల అయ్యాయని, లబ్ధిదారుల చెక్కులు కూడా రెడీ చేసి ఉంచినట్టు మైనార్టీ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలపై ప్రభుత్వం చేస్తున్న డిలేకు నిరుద్యోగ యువతలో అయోమయ పరిస్థితి నెలకొంది.  

మొదటిదే అతీగతి లేదు.. ఇక రెండోదట అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మైనార్టీల స్వయం ఉపాధికి చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.