బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం...భోజనాల ఖర్చు తగ్గించుకుంటున్న ప్రజలు

బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం...భోజనాల ఖర్చు తగ్గించుకుంటున్న ప్రజలు

ఆర్థిక సంక్షోభంతో బ్రిటన్ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల జీవన వ్యయం పెరగడంతో.. అక్కడి జనం నానా తిప్పలు పడుతున్నారు.సెప్టెంబర్ లో యూకేలో ద్రవ్యోల్భణం 10 శాతం కంటే ఎక్కువ అయింది. దీని కారణంగా ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనం భోజన ఖర్చులు తగ్గించుకుంటున్నారు.

80 శాతం ప్రజలు ఆర్థికంగా కష్టపడుతున్నారు..
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన తర్వాత విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రజలను ఇంధన పేదరికంలోకి నెట్టేస్తుందని అంచనా వేశారు. దీనికి తోడు జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోవడంతో సగం మంది యూకే జనం ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. రోజువారీ తీసుకునే భోజనాల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. ఈ మేరకు కన్జుమర్ గ్రూప్ విచ్ పేర్కొంది. దీనిపై విచ్ సంస్థ.. 3 వేల మందిపై సర్వే జరిపింది. సంక్షోభం ముందుతో పోలిస్తే ప్రజలు తినడం చాలా తక్కువ అయిందని వెల్లడించింది. 80 శాతం మంది ప్రజలు ఆర్థికంగా కష్టపడుతున్నారని... యూకే ప్రభుత్వం ఇంధన ధరలను ఫ్రీజ్ చేయడంతోనే ప్రజలు కనీసం తమ ఇళ్లను హీటర్లు వాడుకోలేకపోతున్నారని సర్వే రిపోర్టులో వెల్లడైంది. 

మరింత జఠిలం అయ్యే అవకాశం...
బ్రిటన్తో పాటు.. ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం.. యూరోపియన్ దేశాల్లో తీవ్ర ఇంధన సమస్యలకు దారి తీసింది. వర్షాకాలంలోని దారుణ పరిస్ధితులు ఉంటే... రానున్నది శీతాకాలంకావడంతో.. యూరప్ వాసుల కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బ్రిటన్ వృద్ధి రేటు క్షీణించే ఛాన్స్..
ప్రధానిగా ఎన్నికయ్యాక లిజ్ ట్రస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ వివాదానికి కారణం అయింది. పన్నులపై కోత విధించడంతో... ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాజీ కార్టెంగ్ ను పదవి నుంచి తప్పించిన లిజ్... జెరెమీ హంట్ను ఆర్థిక మంత్రిగా నియమించారు. మరోవైపు బ్రిటన్ లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా...ఆ దేశ వృద్ధి రేటు కూడా క్షీణిస్తుందని నిపుణఉలు అంచనా వేస్తున్నారు. 2023లో బ్రిటన్ వృద్ధి రేటు 5 శాతం కన్నా దిగువనే ఉంటుందని వెల్లడించారు.